ప్రముఖ పంజాబీ నటుడు సింగర్ దీప్ సిద్ధూ మృతి

ప్రముఖ పంజాబీ నటుడు సింగర్ దీప్ సిద్ధూ మృతి

పంజాబీ నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో దీప్ సిద్ధూ ఢిల్లీ నుంచి బఠిండాకు వెళ్తుండగా.. హర్యానాలోని సోనిపట్ దగ్గర ప్రమాదం జరిగింది. కుండలీ-మానేసర్ ఎక్స్ ప్రెస్ హైవేపై దీప్ సిద్ధూ నడుపుతున్న స్కార్పియో.. ట్రక్కుని ఢీకొంది. తీవ్రగాయాలైన సిద్ధూని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే.. చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. యాక్సిడెంట్ టైమ్ లో కారులో ఉన్న మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. న్యాయవాదిగా కెరీర్ ని ప్రారంభించి నటుడు, గాయకుడిగా మారిన దీప్ సిద్ధూకి పంజాబ్ లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది జనవరి 26న ఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింస చెలరేగింది. అప్పట్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వెనుక దీప్ పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. హింస ప్రేరేపించడం, ఎర్రకోటపైన మత సంబంధ జెండాను ఎగురవేయడం వెనుక దీప్  సిద్ధూ పాత్ర ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. రైతు సంఘాలు కూడా దీప్ సిద్ధూ వైఖరిని ఖండించాయి. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి గతేడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఏప్రిల్ లో ఆయనకు బెయిల్  వచ్చినా వెంటనే అరెస్టయ్యారు. అదే నెల ఆఖరున బెయిల్  పై రిలీజ్ అయ్యారు. ఈ కేసు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఢిల్లీలోని ఓ కోర్టు దీప్ సిద్ధూని ఆదేశించింది.