సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత

సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖు మరుగుజ్జు సినీనటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయనకు అస్వస్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయస్సున్న వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. నల్గొండ జిల్లా ఫణిగిరిలో పుట్టిన వీరయ్య... పుట్టుకతోనే మరుగుజ్జు. 2 అడుగులు మాత్రమే ఉండటం ఒకరకంగా ఆయనకు వరంగా మారింది. సినీ పరిశ్రమలో నటుడిగా తన ఆహార్యం అవకాశాలను తెచ్చిపెట్టింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 500కుపైగా చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు ప్రోత్సాహంతో విఠలాచార్య చిత్రం అగ్గివీరుడు చిత్రంతో నటుడిగా పరిచయమైన పొట్టి వీరయ్య అనేక చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. జగన్మోహిని, రాధమ్మపెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను నవ్వించాడు. మాంత్రికుడి సహాయ పాత్రల్లో నటించి మెప్పించేవాడు. దర్శకరత్న దాసరి ప్రోత్సాహంతో ఎస్వీ రంగారావు పక్కన తాత మనవడు చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరయ్య... నటీనటుల సంఘంలోనూ కీలక సభ్యుడిగా ఉన్నారు. క్రమం తప్పకుండా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకువాడు. వీరయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె విజయ దుర్గకు దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్న పొట్టి వీరయ్య చాలా కాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు.
రేపు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు 
పొట్టి వీరయ్య మరణం పట్ల పలువురు చిత్ర నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కరోనా విపత్తు వేళ అనారోగ్యంతో ఆయన కన్నుమూయడం బాధాకరమని, ముఖ్యంగా సీనీ పరిశ్రమకు తీరని లోటని  పేర్కొన్నారు.  రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
పొట్టి వీరయ్యకు ముగ్గురు సంతానం 
ఈయన భార్య పేరు గట్టు నరసమ్మ. పొట్టి వీరయ్య తండ్రి పేరు గట్టు సింహాద్రయ్య. వీరయ్య రెండో రెండో సంతానం. తనకంటే ముందు పుట్టిన అక్కయ్య సాధారణంగానే జన్మించింది. సహ నటి అయిన మల్లికను ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరయ్య. వీరికి ముగ్గురు సంతానము. చిన్న కుమార్తె బండ జ్యోతి ఇతని లాగే మరుగుజ్జు. పొట్టి వీరయ్య భార్య 2008లో మధుమేహంతో బాధపడుతూ చనిపోయింది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి సినీ ప్రస్ధానం మొదలుపెట్టి నిన్న మొన్నటి హెచ్డీ సినిమాల వరకు దాదాపు 46 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించాడు.
1967లో సినీ రంగ ప్రవేశం 
తన చిన్నతనంలో వీరి గ్రామస్తుడైన మంగళ్‌గోపాల్ అని ఓ వ్యక్తి పెళ్లిళ్లకు సినిమా అలంకరణలు చేసేవాడు. అతని ద్వారా 1967లో మద్రాసులో అడుగుపెట్టాడు పొట్టి వీరయ్య. తొలుగ ఉపాధి కోసం తనకు పరిచయం ఉన్న పూల అంగడిలో వీరయ్యను అసిస్టెంట్ గా చేర్పించారాయన. కొద్ది రోజులయ్యాక మంగళగోపాల్ ద్వారా హీరో శోభన్‌బాబును కలువగా ఆయన బి.విఠలాచార్యగారిని కానీ, భావన్నారాయణగారిని కానీ కలవమని సూచించాడు. పొట్టి వాళ్లకు అవకాశం ఇచ్చేది వాళ్లే అని శోభన్ బాబు సలహా ఇచ్చారు. వెంటనే భావన్నారాయణగారిని కలువగా ఆయన పట్టించుకోలేదు. తర్వాత విఠలాచార్యను కలిశాక ఇతడి ఆకారం చూసి.. తన సినిమాలలో పలు అవకాశాలు కల్పించాడు. విఠలాచార్య తీసిన అగ్గివీరుడు ద్వారా  తెరంగేట్రం చేసిన పొట్టివీరయ్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సహంతో చాలా సినిమాల్లో నటించాడు. దాసరి తీసిన తాతా మనవడులో గుమ్మడితో కలిసి నటించిన పొట్టి వీరయ్య తర్వాత  దాసరి దర్శకత్వంలో వచ్చిన రాధమ్మపెళ్లి చిత్రంలో హిజ్రాగా నటించాక అవకాశాలు తలుపుతట్టడం పెరిగింది. అదే ఊపులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ లాంటి మహానటులతో పొట్టివీరయ్య కలిసి పనిచేశాడు.