పరిచయం..నటనకు స్కోప్​ ఉండాలి

పరిచయం..నటనకు స్కోప్​ ఉండాలి

కేరళకు చెందిన ఈ యాక్టర్ సపోర్టింగ్ రోల్​, లీడ్ రోల్​... ఇలా ఏదైనా సరే పర్ఫార్మెన్స్​కి స్కోప్​ ఉన్న ప్రాజెక్ట్స్​ ఎంచుకుంటాడు. అందుకే మంచి పర్ఫార్మర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఒక వైపు మలయాళం సినిమాలు చేస్తూనే, మరోవైపు బాలీవుడ్​లోనూ నటిస్తున్నాడు. తమిళంలో కూడా ఒక సినిమా చేశాడు. ‘భాష ఏదైనా, నటన ఎక్కడైనా ఒకటే కదా’ అంటున్న ఇతగాడి పేరు రోషన్ మాథ్యూ. ఈ మధ్యనే ‘పోచర్’ అనే వెబ్​ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

‘‘మాది కేరళలోని కొట్టాయంలో చంగనస్సెరి అనే ఊరు. మా నాన్న మాథ్యూ జోసెఫ్, బ్యాంక్ మేనేజర్. అమ్మ రెజీనా అగస్టీన్​ పీడబ్ల్యూడీ ఇంజనీర్. నేను కొట్టాయంలోని కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుకున్నా. తర్వాత ఇంజనీరింగ్ కోసం కొచ్చికి వెళ్లా. కానీ, నచ్చక తరువాతి ఏడాది  చెన్నైలోని మద్రాస్​ క్రిస్టియన్ కాలేజీలో బిఎస్సీ ఫిజిక్స్​లో చేరా. డిగ్రీ చదువుతున్నప్పుడు సెకండియర్​లో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ముంబై వెళ్లి అక్కడ డ్రామా స్కూల్లో చేరా.

నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే స్టేజీ పర్ఫార్మెన్స్​లు ఇచ్చా. ప్రొఫెషనల్​ నాటకాల్లో నటించేందుకు మొదటి అవకాశం వచ్చింది కాలేజీలో చదివేటప్పుడు. చెన్నైలో చదివేటప్పుడు ‘స్టేజ్​ఫ్రైట్​ ప్రొడక్షన్స్’ పేరుతో ఒక థియేటర్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీ కొత్త యాక్టర్స్ కోసం మా కాలేజీలో ఆడిషన్స్ తీసుకుంది. అది 2010 ఆగస్ట్​. ఆ ఆడిషన్స్​లో పార్టిసిపేట్ చేసిన నాకు ‘నియల్ కెల్లెర్​మాన్’ అనే పాత్ర చేసే ఛాన్స్​ వచ్చింది.

2011లో ‘ది మ్యూజియమ్ థియేటర్’​లో స్టేజీ మీద ఆ పాత్ర చేశా. దాంతో నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్​ పెరిగింది. చెన్నైలో థియేటర్ కంపెనీలకు వెళ్లి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అలా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ తరఫున నా ఫ్రెండ్స్​తో కలిసి ఒక థియేటర్ గ్రూప్ పెట్టా. దాని పేరు ‘థియేటర్ నెం. 59’. అప్పట్నించీ చాలా రోజులు నాటకాల్లో నటించా. మేం చేసిన ఒక నాటకం బాగా పాపులర్​ కావడంతో ఇతర కాలేజీల్లో కూడా పర్ఫార్మ్​ చేశాం. కొచ్చిలో నేను ఒక నాటకాన్ని డైరెక్ట్ చేశా. దాని పేరు ‘ఎ వెరీ నార్మల్​ ఫ్యామిలీ’. అందులో నటించిన వాళ్లంతా కొత్తవాళ్లే. దానికి నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది. 

ఇతర భాషలపై ఆసక్తి

చెన్నైలో చదువుకునేటప్పుడు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల చైల్డ్​హుడ్​ స్టోరీలు నాకంటే భిన్నంగా ఉండేవి. వాళ్లు చూసే సినిమాలు కొత్తగా అనిపించేవి. అలా వాళ్ల ఇన్​ఫ్లుయెన్స్​తో మలయాళం సినిమాలు మానేసి, ఇతర భాషల సినిమాలు చూడటం మొదలుపెట్టా. అలాగే స్కూల్లో ఉన్నప్పుడు హిందీ సబ్జెక్ట్ చదువుకున్నా.

మా అక్క నార్త్​ ఇండియాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి వెళ్లింది. తను వచ్చినప్పుడల్లా హిందీలో మాట్లాడేది. ఆ తర్వాత 2014లో ముంబై వెళ్లా. అక్కడ ఒక డ్రామా స్కూల్​లో చేరా. అందులో చేరినప్పుడు వాళ్లు ‘‘ఏ భాష ఎంచుకుంటావ్​?’’ అని అడిగారు. నాతో పాటు ఉన్న వాళ్లు, అక్కడి వాతావరణం అంతా హిందీ వాళ్లతోనే కాబట్టి నేనదే కంటిన్యూ చేస్తా అని చెప్పా. అలా ఇంకాస్త బెటర్​గా హిందీ నేర్చుకున్నా. ఆ తర్వాత ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ మూవీ డైరెక్టర్ ఫజే జలాలి దగ్గర ‘07/07/07 ప్రాజెక్ట్’​లో చేరా. ఆ తర్వాత మరో డైరెక్టర్ పద్మ దామోదరన్​ దగ్గర చేరా. 

వెబ్​సిరీస్​తోనే స్క్రీన్​పైకి

మొదటిసారి హిందీ సినిమాకి ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను ముంబైలో థియేటర్​ వర్క్ చేస్తున్నా. అప్పుడు సినిమాల్లో నటించాలని డిసైడ్​ అయ్యి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆడిషన్ అయితే ఇచ్చా కానీ, అందులో నేను సెలక్ట్ కాలేదు. దాంతో వెబ్​ సిరీస్​ వైపు మళ్లా. యూట్యూబ్​లో రెండు సిరీస్​లు చేశాక ‘పాతాళ్​ లోక్​’లో పనిచేసిన ప్రోసిత్ రాయ్ ‘టాన్ లైన్స్’ అనే వెబ్ సిరీస్ తీస్తున్నాడని తెలిసి అతన్ని కలిశా. నాకు తెలిసి నేను ఇచ్చిన పెద్ద ఆడిషన్​ అదే. అది నా ఫస్ట్ ప్రాజెక్ట్​. 

ఆనందంతో బ్రేక్​ 

‘కప్యారె కూటమని’ అనే మలయాళ సినిమాలో చిన్న రోల్​ ఒకటి చేశా. ‘పుతియ నియమమ్​’ సినిమా ద్వారా 2016లో డెబ్యూ ఇచ్చా. అదే ఏడాది వచ్చిన ‘ఆనందం’ అనే సినిమాతో నా కెరీర్​కి బ్రేక్ వచ్చింది. అంతకంటేముందు కొన్ని ప్రాజెక్ట్స్​లో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అవి చేశాక కూడా నేను ఆడిషన్స్​ ఇవ్వడానికి తిరిగా. ‘ఆనందం’ సినిమా రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. ఆఫర్స్ రావడం మొదలైంది. నాకింకా గుర్తు ఒక ఫోన్​ కాల్.. ఫోన్​లోనే వాళ్లు సబ్జెక్ట్​ చెప్పారు. నేను వెంటనే ‘‘ఆడిషన్​కి ఎప్పుడు రావాలి?’’ అని అడిగా. ‘‘ఆడిషన్స్​కి రానక్కర్లేదు. చేస్తావా? లేదా? చెప్తే చాలు’’ అన్నారు. ఒక యాక్టర్​కి అది చాలా పెద్ద విషయం.

ఎగ్జయిట్​మెంట్​తో..

‘ఒరు తక్కన్​ తల్లు కేస్​’ సినిమా నేను ఎంతో ఇష్టపడి చేశా. ఆడియెన్స్​ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎగ్జయిట్​మెంట్​తో ఎదురుచూశా. ఆడియెన్స్​కి అది నచ్చలేదు. అలాగే కొన్ని సినిమాలు నచ్చితే మర్చిపోరు.

అలాంటి వాటిలో ఒకటి ‘కప్పేలా’. ఆ సినిమా కొవిడ్​కి ముందు రిలీజ్ అయింది. అప్పుడు సినిమా గురించి బాగా చెప్పుకున్నారు. ఆడియెన్స్​కి అది బాగా నచ్చింది. ఇప్పటికీ కొందరు నాతో ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అది కూడా కేరళ వాళ్లు కాదు.. బయటి వాళ్లు. కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్​తో అంత బాగా తీయగలగడం అద్భుతం అనే చెప్పాలి. 

డిఫరెంట్​గా ఉంటేనే ఇష్టం

ప్రతి ప్రాజెక్ట్​ చాలా డిఫరెంట్​. కానీ, చేసే పని మాత్రం ఒకటే. అందులో పనిచేసే టెక్నీషియన్లు, యాక్టర్లు, వర్క్​ ఎన్విరాన్​మెంట్ అంతా కొత్తగా ఉంటుంది. నేను దాన్ని ఆస్వాదిస్తా. నేను ఒకేచోట ఉండి, ఒకే రకమైన పనులు చేయాలనుకోను. ఒక పాత్ర ఇంకో పాత్రకి దగ్గరగా ఉంది అనిపించిన క్షణం వేరే దానికి షిఫ్ట్​ అవ్వడానికి ట్రై చేస్తా. మళ్లీ మలయాళం సినిమాల్లో చేస్తా. అలాగే ఇతర భాషలు, పాత్ర అర్థం చేసుకుని చేయగలను అనిపిస్తే... ఆ భాష రాకపోయినా చేస్తా. ఓటీటీ వచ్చాక పాన్ ఇండియా ఆడియెన్స్ ఉన్నారు. సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఏ భాషలో వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. 

మిస్​ అవుతున్నా

నాటకాలను వదిలేసినప్పటి నుంచి వాటిని మిస్​ అవుతున్నా. అయితే నాకు పనితోపాటు, ప్రశాంతత కూడా కావాలి. అందుకే మూవీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. నాటకాల్లో చేయాలంటే ఎక్కువరోజులు పడుతుంది. కమిట్​మెంట్ చాలా ఉండాలి. ఇవేకాకుండా ఫిజికల్​గా రెడీగా ఉండగలగాలి. కొచ్చిలో ఉండే నా ఫ్రెండ్స్ కొందరికి నాటకాలంటే ప్యాషన్​. వాళ్లు నాటకాలతోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు వాళ్లతో కలిసి నాటకాలకు సంబంధించిన పనులేవైనా షేర్ చేసుకుంటా. 

అదే మంచి విషయం

ఒక యాక్టర్​ లైఫ్​లో మంచి విషయం ఏంటంటే... ‘‘ఈ ప్రాజెక్ట్​లో నువ్వు చేస్తే బాగుంటుంది’’ అని ఆఫర్స్ రావడం. అలాగే తనకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం యాక్టర్​కి ఉండడం. అలా నాకు ‘డార్లింగ్స్’ అనే హిందీ సినిమాకి, ఇప్పుడు ‘పోచర్​’కి వచ్చింది.

పోచర్ గురించి

పోచర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. ముఖ్యంగా షూటింగ్​ చాలా బాగా జరిగింది. ఇప్పటివరకు నేను చేసిన షూటింగ్స్​లో నన్ను బాగా ఎగ్జైట్​ చేసింది ఇదే. ఈ సిరీస్ చాలావరకు సీరియస్​గా ఉంటుంది. డార్క్ క్రైమ్​ థ్రిల్లర్. షూటింగ్​ ఎంత సీరియస్​గా చేశామో, అంత నవ్వుకున్నాం కూడా. నా పాత్ర విషయానికొస్తే.. నేను అలన్ జోసెఫ్ క్యారెక్టర్​లో కనిపిస్తా. ‘వైల్డ్​ లైఫ్ ట్రస్ట్​ ఆఫ్​ ఇండియా’ అనే సంస్థలో పనిచేస్తుంటాడు ఈ క్యారెక్టర్​. రియల్​ లైఫ్​లో నేను చేయని చాలా పనులు అతను చేస్తాడు.

నాకు, ఆ పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంది. తను చాలా యాక్టివ్​, ఫన్, ఎనర్జిటిక్​ పర్సన్. ఇదంతా స్క్రిప్ట్​లో చదివినప్పుడే ఎగ్జైట్ అయ్యా. వెంటనే షూటింగ్​కి వెళ్లిపోవాలి అనిపించేంత నచ్చేసింది. ఆ తర్వాత నేను రియల్​ పర్సన్​ని కలిశా. అతని పేరు జోస్ లూయిస్. అతను జీవితంలో కొన్ని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పనులు చేసిన వ్యక్తి. అతన్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడం నా పర్ఫార్మెన్స్​కి బాగా హెల్ప్ అయింది.

షూటింగ్ చేస్తున్నప్పుడు.. ‘‘ఈ సిచ్యుయేషన్​లో జోస్ అయితే ఎలా రియాక్ట్ అయ్యేవాడు’’ అని ఆలోచించేవాడిని. ఆ రియాక్షన్​ని స్క్రిప్ట్​ చూసి మరోసారి కన్ఫామ్ చేసుకునేవాడిని. నేను మలయాళీ, దివ్యేందు బెంగాలీ. ఒకరి భాష మరొకరికి రాదు. అయినా కలిసి నటించడం కష్టంగా అనిపించలేదు. పైగా చాలా ఎగ్జైటింగ్​గా అనిపించింది. ఇలాంటి మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్స్ మరిన్ని రావాలి. ఒక భాషకే పరిమితమవ్వాల్సిన పరిస్థితులు లేవు ఇప్పుడు. నటీనటులంతా కనీసం మూడు భాషల్ని హ్యాండిల్ చేయగలగాలి.