నేను కూడా ఇంజనీర్ నే.. విద్యార్థులకు మద్దతుగా సోనూసూద్

నేను కూడా ఇంజనీర్ నే.. విద్యార్థులకు మద్దతుగా సోనూసూద్

లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చిక్కుకున్న వేలాది మంది వలసదారులు స్వస్థలాలకు చేరడానికి నటుడు సోనూసూద్ ఎంతగానో సాయపడ్డారు. ఇప్పుడు విద్యార్థులకు మద్ధతుగా తన గొంతు వినిపిస్తున్నాడు. దేశంలో నీట్, జేఈఈ పరీక్షలకు కేంద్ర విద్యాశాఖ అనుమతులిచ్చింది. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇంకా మానసికంగా కోలుకోలేదని.. అందుకే పరీక్షలు వాయిదావేయాలని విద్యార్థులు కోరుతున్నారు. వారికి మద్ధతుగా నటుడు సోనూసూద్ కూడా పరీక్షలను వాయిదావేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు మానసికంగా సిద్ధమై పరీక్షలకు హాజరుకావడానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు వారికి సమయమివ్వాలని ఆయన అన్నారు.

‘ఈ సమయంలో విద్యార్థులకు మద్దతు అవసరం. నీట్, జేఈఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 26 లక్షల మంది హాజరుకానున్నారు. బీహార్ లోని దాదాపు 13 నుంచి 14 జిల్లాలు వరదల వల్ల దెబ్బతిన్నాయి. ఆ రాష్ట్రం నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వారిని ఆర్థిక సమస్య వెంటాడుతోంది. వాళ్లు ఉండటానికి ఇళ్లు కూడా లేవు. వర్షాలకు చాలా ఇళ్లు కూలిపోయాయి. ఈ టైంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదు. వారికి రెండు నెలల సమయం ఇవ్వండి. పరీక్షలను నవంబర్ లేదా డిసెంబర్ వరకు వాయిదా వేయాలి. విద్యార్థులు మానసికంగా సిద్ధమైనప్పుడు పరీక్షలు రాయవచ్చు. నేను కూడా ఇంజనీరింగ్ చదివాను. దేశాభివృద్ధిలో పాలుపంచుకునే ఈ కొత్త తరం దేశానికి చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను’అని సోను సూద్ తెలిపారు.

కరోనా కారణంగా ఈ సమయంలో పరీక్షలు అంత సురక్షితం కాదని కొన్ని రాష్రాలు కేంద్రాన్ని కోరాయి. అస్సాం, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గర్, కేరళ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు.. వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ డిమాండ్ ను పలు పార్టీల నాయకులు కూడా సమర్థించారు.

కాగా.. పరీక్షల వాయిదా విషయంపై విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ ‘తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుండి ఒత్తిడి కారణంగానే పరీక్షలు షెడ్యూల్ చేయబడ్డాయి. మేం తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుండి నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాం. జేఈఈ, నీట్ లను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంతకాలం పరీక్షలను వాయిదా వేస్తారని విద్యార్థులు చాలా ఆందోళన చెందారు’ అని ఆయన అన్నారు.

For More News..

ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు

ప్రేమించిందని నవ వధువును స్టేషన్ లో వదిలేసిన తల్లిదండ్రులు, వరుడు

రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు