ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. ఆందోళన చెందుతున్న అభిమానులు!

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. ఆందోళన చెందుతున్న అభిమానులు!

కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్‌(Vijaykanth) ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన.. ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 

కొంతకాలంగా కూడా అనారోగ్య కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌ చూసుకుంటున్నారు. చాలా కాలం తరువాత ఇటీవల జరిగిన ఆయన జన్మదిన వేడుకకు హాజరయ్యారు విజయకాంత్‌. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఉంటున్నారు విజయకాంత్‌. ఇప్పుడు మరోసారి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యపరీక్షలు చేసిన డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరోపక్క విజయ్ కాంత్ పరిస్థితి సీరియస్ గా ఉందని వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో.. వాటికి ముగింపు పలికేలా డీఎండీకే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌ సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరారని, మరో రెండు రోజులలో ఆయన డిశ్చార్జ్‌ అవుతారని, అభిమానులు, క్యాడర్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.