హిండెన్​బర్గ్ ​రిపోర్టు దురుద్దేశపూర్వకమే : గౌతమ్​ అదానీ

హిండెన్​బర్గ్ ​రిపోర్టు దురుద్దేశపూర్వకమే : గౌతమ్​ అదానీ

వెలుగు బిజినెస్​ డెస్క్​: తమ గ్రూప్​పై హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ ఈ ఏడాది జనవరిలో చేసిన ఆరోపణలన్నీ దురుద్దేశంతో కూడినవేనని మంగళవారం జరిగిన యాన్యువల్​ జనరల్​ మీటింగ్​లో అదానీ గ్రూప్ చైర్మన్​ గౌతమ్​ అదానీ విరుచుకుపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే ఆధారాలు లేని ఆరోపణలను ఆ రిపోర్టు చేసిందని విమర్శించారు. అదానీ గ్రూపు పరువు, ప్రతిష్టలను మంట కలపడమే లక్ష్యంగా హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ పెట్టుకుందని పేర్కొన్నారు. 

గ్రూప్​ కంపెనీల షేర్ల ధరలను కిందకి పడగొట్టి లాభం సంపాదించాలనేదే వారి ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఎఫ్​పీఓ పూర్తి సబ్​స్క్రిప్షన్​ను పొందినప్పటికీ, ఆ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు గౌతమ్​ అదానీ ఈ సమావేశంలో షేర్​హోల్డర్లకు వివరించారు. హిండెన్​ బర్గ్​ ఆరోపణలను ఖండించామని, అయినా వదలకుండా వెంటాడారని చెప్పారు. వర్చువల్​గా జరిగిన  అదానీ ఎంటర్​ప్రైజస్​ ఏజీఎంలో గౌతమ్​ అదానీ మాట్లాడారు. 

రిపోర్టుతో కుప్పకూలిన షేర్లు....

హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ జనవరి నెలలో తెచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్​ కంపెనీ షేర్ల ధరలు పేకమేడలా కూలిపోయాయి. షేర్ల ధరల మేనిప్యులేషన్​తోపాటు, అకౌంటింగ్​ ఫ్రాడ్స్​కూ అదానీ గ్రూప్​ పాల్పడుతోందని హిండెన్​బర్గ్​ రిసెర్చ్​ సంచలనాత్మక ఆరోపణలను చేసింది.  పర్యవసానంగా ఆ గ్రూప్ షేర్ల మార్కెట్​ వాల్యూ ఒక దశలో 145 బిలియన్​ డాలర్ల మేర పడిపోయింది. ​ హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ చేసిన ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టిన అదానీ గ్రూప్​ భవిష్యత్​లో మరింత పుంజుకోవడానికి తగిన వ్యూహాన్ని రెడీ చేసుకుంది. ఈ దిశలోనే కొన్ని ఎక్విజిషన్లను నిలిపివేయడంతోపాటు, ప్లాన్స్​ను కూడా మార్చుకుంది. క్యాష్​ ఫ్లోస్​ తగినంతగా లేవనే విమర్శలను తిప్పికొట్టడానికి, అంతకుముందు తీసుకున్న కొన్ని అప్పులను సైతం అదానీ గ్రూప్​ తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టుల స్పీడ్​నూ తగ్గించుకుంది. 
మే నుంచి రూ. 11,330 కోట్ల 

షేర్లు అమ్మిన ప్రమోటర్లు....

రెండు దశలలో అదానీ గ్రూప్​ ప్రమోటర్లు ఈ ఏడాది మే నెల నుంచి రూ. 11,330 కోట్ల విలువైన షేర్లను గ్లోబల్ ఈక్విటీ ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ జీక్యూజీ పార్ట్​నర్స్​కి అమ్మేశారు. మరోవైపు అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ కొత్తగా అప్పులు తీసుకుంది. ఈ అప్పుల కోసం అదానీ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​లోని 21.4 శాతం వాటాలను కుదువ పెట్టినట్లు ఎన్​ఎస్​డీఎల్​ డేటా చెబుతోంది. 

మా ట్రాక్​ రికార్డే మా గురించి చెబుతుంది...

మా గ్రూప్​ ట్రాక్​ రికార్డే గ్రూప్​ గురించి వివరాలు చెబుతుంది. సవాళ్లు ఎదుర్కొంటున్న  టైములో గ్రూప్​కంపెనీలకు మద్దతుగా నిలిచిన షేర్​హోల్డర్లకు నా కృతజ్ఞతలు. ఈ క్రైసిస్​ సమయంలోనే గ్లోబల్​ ఇన్వెస్టర్ల నుంచి బిలియన్​ల కొద్దీ డాలర్లను సమీకరించాం. అంతేకాదు, ఏ రేటింగ్​ ఏజన్సీ గ్రూప్​ కంపెనీల రేటింగ్స్​ను తగ్గించలేదు. అదానీ గ్రూప్ కంపెనీల​పై ఇ న్వెస్టర్లకు అచంచలమైన విశ్వాసం ఉందనడానికి ఇదే నిదర్శనం.