Adani vs Ambani: 2026 ఏడాది భారత కార్పొరేట్ రంగంలో ఒక సంచలన మార్పుకు దారితీసింది. దేశంలోని టాప్ బిజినెస్ మెన్ గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల సంపద గ్రాఫ్‌లు ఈ ఏడాది పూర్తి భిన్నమైన దిశల్లో ప్రయాణిస్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జూన్ 4, 2026 డేటా ప్రకారం.. ఒకరికి లాభాల పంట పండుతుంటే, మరొకరికి నష్టాల సెగ తగులుతోందట. కేవలం 155 రోజుల్లోనే గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకెళ్లగా, ముఖేష్ అంబానీ సామ్రాజ్యం కొంత నెమ్మదించింది.
ఆకాశానికి అదానీ సంపద..
హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత అద్భుతమైన రీతిలో పుంజుకున్న గౌతమ్ అదానీకి 2026 ఏడాది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఈ ఏడాది కేవలం 155 రోజుల్లోనే అదానీ సంపద విలువ 30.7 బిలియన్ డాలర్లు అంటే సుమారు 2లక్షల 90వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఇది ఆయన మొత్తం సంపదలో ఏకంగా 36.3 శాతం వృద్ధిని సూచిస్తోంది. అంటే అదానీ 2026లో ప్రతిరోజూ దాదాపు 1,897 కోట్ల రూపాయలు సంపదను పెంచుకున్నారు. ఈ భారీ లాభాలతో అదానీ మొత్తం ఆస్తి 115 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకి, ఆసియాలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచారు.
బేజారిన అంబానీ సంపద..
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అధినేత ముఖేష్ అంబానీకి 2026 ఏడాది అంతగా కలిసిరాలేదు. మార్కెట్ ఒడిదొడుకులు ఆయన సంపదను భారీగానే దెబ్బతీశాయి. ఈ ఏడాది అంబానీ సంపద 21.9 బిలియన్ డాలర్లు అంటే సుమారు 2లక్షల 9వేల కోట్ల రూపాయలు ఆవిరైంది. ఇది అదానీ మొత్తం ఆస్తిలో దాదాపు 20.4 శాతం క్షీణతకు కారణమైంది. అంటే ఈ ఏడాది ప్రతిరోజూ సగటున అంబానీ సంపద 1,352 కోట్ల రూపాయలు తరిగిపోయింది. ప్రస్తుతం అంబానీ నికర ఆస్తి విలువ 85.8 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 26వ స్థానానికి పరిమితమయ్యారు.
ఈ ఇద్దరు వ్యాపారవేత్తల సంపదలో ఇంత పెద్ద వ్యత్యాసానికి స్టాక్ మార్కెట్లో వారి కంపెనీల భిన్నమైన పనితీరే ముఖ్య కారణం. అదానీ ఫార్చ్యూన్ ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ వంటి గ్రూప్ కంపెనీల షేర్ల బూమ్‌పై ఆధారపడి పెరిగింది. వీటికి భిన్నంగా ముఖేష్ అంబానీ సంపదకు మూలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ ఏడాది దాదాపు 18 శాతం, అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 20 శాతం మేర పతనం కావడం నెట్ వర్త్‌ను గట్టిగానే దెబ్బతీసింది.
అదానీ సాధించిన ఈ గ్రోత్.. గతంలో ఆయన ఎదుర్కొన్న ఒక పెద్ద సంక్షోభం తర్వాత రావడం విశేషం. జనవరి 2023లో షార్ట్-సెలర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక అదానీ గ్రూప్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఒకానొక దశలో గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పడిపోయింది. అయితే గడిచిన రెండేళ్లలో అదానీ గ్రూప్ కంపెనీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మార్కెట్లో మళ్లీ బలంగా నిలబడ్డాయి. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పునరుద్ధరించడం ద్వారా 2026 లో ఈ రికార్డు స్థాయి రికవరీని సాధించగలిగాయి. వ్యాపార సామ్రాజ్యంలో హెచ్చుతగ్గులు సహజమే అయినప్పటికీ.. అదానీ సాధించిన ఈ 'మహా రికవరీ'.. అంబానీ ఎదుర్కొంటున్న తాత్కాలిక తిరోగమనం భారత కార్పొరేట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపుగా నిలిచిపోతుంది.
