న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన రెన్యువబుల్ ఎనర్జీ జాయింట్ వెంచర్‌లో 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,500 కోట్లు) పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్ సంస్థకు, ఈ ఫ్రెంచ్ కంపెనీకి సమాన వాటాలు ఉంటాయి. దీనికి 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది. టోటల్ ఎనర్జీస్ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్ (ఏఆర్ఈ9ఎల్)లో 50 శాతం వాటాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏఈజీఎల్) స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఏఈజీఎల్ కి ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థ. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోలో 300 మెగావాట్ల కార్యాచరణ సామర్థ్యం, 500 మెగావాట్ల నిర్మాణంలో ఉన్న సోలార్ ప్రాజెక్టులు, 250 మెగావాట్ల సామర్థ్యం గల అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఏఈజీఎల్లో దాదాపు 19.75 శాతం వాటా ఉన్న టోటల్ ఎనర్జీస్ గతంలో ఏఈజీఎల్, మరొక అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 27 నాటి వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో కంపెనీల మొత్తం వాల్యుయేషన్ 489 మిలియన్ డాలర్లకు సమానం. టోటల్ ఎనర్జీస్ డీల్‌కు ఆమోదం కోరుతూ షేర్‌హోల్డర్‌లకు పంపిన నోటీసులో ఏఈజీఎల్ ఈ విషయం తెలిపింది. "లావాదేవీలో భాగంగా, టోటల్ ఎనర్జీస్ ఏఆర్ఈ9ఎల్లో 50 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. వీటి విలువ 300 మిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో పలు కంపెనీలను కలిగి ఉంటుంది " అని పేర్కొంది. నిర్మాణంలో ఉన్న, అభివృద్ధిలో లేని ప్రాజెక్ట్‌లు వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి, నిధుల కేటాయింపునకు జేవీ దృష్టి పెడుతుంది. ఫ్రెంచ్ సంస్థ ఏజీఈ23ఎల్లో రూ. 4,013 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది.
