అంబానీని మించిన అదానీ..సంపదలో నంబర్ వన్​

అంబానీని మించిన అదానీ..సంపదలో నంబర్ వన్​
  • సుప్రీం తీర్పుతో భారీగా పెరిగిన అదానీ షేర్లు
  • రూ.9.37 లక్షల కోట్లకు పెరిగిన నికర విలువ

సుప్రీం కోర్టు తీర్పుతో గౌతమ్​ అదానీ సంపద అమాంతం పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీని ఆయన మించిపోయారు. అదానీ గ్రూపునకు అనుకూలంగా తీర్పు రావడంతో అహ్మదాబాద్‌‌‌‌కు చెందిన ఈ సంస్థ కంపెనీల షేర్లు బుధవారం 12 శాతం వరకు పెరిగాయి. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లకు చేరింది. ఈ లాభాల ఫలితంగా, గౌతమ్ అదానీ కుటుంబం అంబానీని అధిగమించింది. భారతదేశంలో అత్యంత సంపన్న ప్రమోటర్ గుర్తింపును తిరిగి సంపాదించుకుంది. బుధవారం గౌతమ్ అదానీ కుటుంబం నికర విలువ రూ.9.37 లక్షల కోట్లకు పెరిగింది. అంతకు ముందు రోజు దీని విలువ రూ.8.98 లక్షల కోట్లు. 

ఈ కాలంలో ముకేశ్‌‌ అంబానీ కుటుంబ నికర విలువ రూ.9.38 లక్షల కోట్ల నుంచి రూ.9.28 లక్షల కోట్లకు కొద్దిగా తగ్గింది. అదానీ గ్రూపు చైర్మన్​, బిలియనీర్ గౌతమ్ అదానీ గత డిసెంబర్ 6 నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (బీబీఐ)లో 15వ స్థానానికి చేరుకున్నారు. అప్పుడే భారతదేశం,  ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి కాస్త దూరంలో ఉన్నారు. 82.5 బిలియన్ డాలర్ల (6.8 లక్షల కోట్లు) నికర విలువతో నెట్​వర్త్​ ఈయన అప్పుడు ప్రపంచంలోని 15వ అత్యంత సంపన్నుడు. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్న భారతీయుడు. అయితే  గత సంవత్సరంలో 38 బిలియన్ డాలర్లను కోల్పోయారు. - ఈ నష్టంలో ఎక్కువ భాగం హిండెన్‌బర్గ్ ఆరోపణల వల్ల వచ్చింది. 

గత ఏడాది జనవరిలో  న్యూయార్క్​కు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌ స్టాక్ మానిప్యులేషన్,  అకౌంటింగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ వాదనలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరలలో క్షీణత ఫలితంగా అదానీ వ్యక్తిగత సంపద దాదాపు 60 శాతం క్షీణించి, 69 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూపు ఎఫ్​ఎంసీజీ మొదలుకొని విమానాశ్రయాల వరకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే  అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు ఈ సంస్థకు ఉంది.  ప్రపంచ బొగ్గు వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 17 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పిదంటే..

అదానీ గ్రూపు స్టాక్ ధరలను తారుమారు చేసిందనే ఆరోపణలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)​ బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు  నిరాకరించింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణను మూడు నెలల్లో  పూర్తి చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది.  సెబీ విధానాల్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.  అదానీ గ్రూప్‌‌‌‌పై వచ్చిన ఆరోపణలపై సెబీ 24 అంశాల్లో ఇది వరకే 22 విచారణలను పూర్తి చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. సెబీ తరపున సొలిసిటర్ జనరల్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌‌‌‌లో ఉన్న రెండు దర్యాప్తులను మూడు నెలల్లో  చేయాలని సెబీని ఆదేశిస్తున్నామని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా,  మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అదానీ గ్రూప్ స్టాక్స్ ర్యాలీ

  •     అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 11.60 శాతం పెరిగి రూ.1,183.90కి చేరుకుంది.
  •     అదానీ టోటల్ గ్యాస్ 9.84 శాతం పెరిగి రూ.1,099.05 వద్ద ముగిసింది.
  •     అదానీ గ్రీన్ ఎనర్జీ 6 శాతం పెరిగి  రూ.1,698.75కి చేరుకుంది.
  •     అదానీ పవర్ షేర్లు 5 శాతం లాభంతో రూ.544.65 వద్ద ముగిశాయి.
  •     అదానీ విల్మార్ 3.97 శాతం లాభాన్ని పొంది  రూ.381.05 వద్ద ముగిసింది.
  •     ఎన్డీటీవీ షేర్లు 3.66 శాతం పెరిగి రూ.281.60 వద్ద స్థిరపడ్డాయి.
  •     ఫ్లాగ్‌‌‌‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ 2.45 శాతం పెరిగి, రూ.3,003.95 వద్ద ముగిసింది.
  •     అదానీ పోర్ట్స్ 1.39 శాతం పెరుగుదలను నమోదు చేసి, రూ.1,093.50కి చేరుకుంది.
  •     అంబుజా సిమెంట్స్ షేర్లు 0.94 శాతం పెరిగి రూ.535.60కి చేరుకున్నాయి.
  •     ఏసీసీ 0.10 శాతం పెరిగి  రూ.2,270 వద్ద ముగిసింది.