కరీంనగర్ టౌన్, వెలుగు: మండల, క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ అధికారులు ప్రతిరోజు యూరియా సరఫరాను పర్యవేక్షించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఏవోలు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 4,246 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రస్తుత అవసరానికి ఈ నిల్వలు సరిపోతాయన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఏవో భాగ్యలక్ష్మి, ఏవోలు, పీఏసీఎస్‌ల బాధ్యులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
