నాణ్యతకు బీఐఎస్‌ నిదర్శనం : అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వర్

నాణ్యతకు బీఐఎస్‌ నిదర్శనం : అడిషనల్  కలెక్టర్  సంచిత్  గాంగ్వర్

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: వస్తువుల కొనుగోలు విషయంలో భారత ప్రామాణిక సంస్థ(బీఐఎస్‌) నాణ్యతకు నిదర్శనమని అడిషనల్  కలెక్టర్  సంచిత్  గాంగ్వర్  పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో బీఐఎస్‌  జాయింట్  డైరెక్టర్‌  తన్నీరు రాకేశ్​ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌  శాఖలు ఒకే రకమైన నాణ్యత ఉన్న వస్తువులను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నాయని చెప్పారు. జిల్లాలోనూ అవే ప్రమాణాలు పాటించాలన్నారు. డ్రిప్‌  ఇరిగేషన్‌  పైపులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం, పాల ఉత్పత్తులు నాణ్యతగా ఉండాలన్నారు. అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులకు ఇండియన్‌  స్టాండర్డ్స్​పై సర్క్యులర్‌  జారీ చేయాలని ఆదేశించారు. బీఐఎస్‌  జాయింట్  డైరెక్టర్‌  మాట్లాడుతూ కంప్యూటర్స్‌, ప్రింటర్స్‌, ఏసీ, కూలర్స్‌, ఫ్యాన్​ల విషయంలో తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో శైలేశ్ కుమార్, డీఆర్డీవో మొగులప్ప, డీఏవో జాన్ సుధాకర్, డీఈవో గోవిందరాజులు, హౌసింగ్  పీ డీ శంకర్ నాయక్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీఐఈవో సుదర్శన్, డీపీఆర్వో ఎంఏ రశీద్  పాల్గొన్నారు.