రైతుల నుంచి ప్రతి వడ్ల గింజ కొంటాం : కలెక్టర్​ వెంకటేశ్వర్లు

రైతుల నుంచి ప్రతి వడ్ల గింజ కొంటాం : కలెక్టర్​ వెంకటేశ్వర్లు

వనపర్తి/గోపాల్​పేట, వెలుగు: రైతుల నుంచి ప్రతి వడ్ల గింజను కొంటామని అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు. గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో రెండు రోజుల కింద రైతులు ఆందోళనకు దిగడంతో గురువారం మండలంలోని బుద్దారం, పోలికేపాడ్, గోపాలపేట కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి గోపాలపేట మండలానికి లారీలను కేటాయించాలని ఆదేశించారు. అవసరమైతే గోదామ్​లు, మిల్లులకు గ్రామాల్లోని ట్రాక్టర్ల ద్వారా వడ్లను తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇన్​చార్జిలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వనపర్తిలో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. యాసంగి సీజన్​లో ఈసారి ఊహించని రీతిలో 3.90 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వచ్చిందని, ఇప్పటి వరకు 57,008 మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని తెలిపారు. గోదామ్​లు ఖాళీగా లేకపోవడంతోనే కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయని చెప్పారు. దొడ్డు రకం వడ్ల కొనుగోలు చేసిన కేంద్రాల వద్ద సమస్య ఎదురవుతోందని, సన్నరకాల వడ్ల లోడింగ్, అన్​ లోడింగ్​ విషయంలో సమస్య లేదన్నారు. ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్​తో మాట్లాడి ఎప్పటికప్పుడు అన్​లోడ్​ చేసేలా, మిల్లర్లు వెంటనే వడ్లు దించుకునేలా చూస్తున్నామని తెలిపారు. 

జిల్లాలో 178 రైస్​ మిల్లులు ఉంటే, 49 మందిపై క్రిమినల్​ కేసులు, ఆర్ఆర్​ యాక్ట్​ ఉండడంతో వడ్లు కేటాయించలేదన్నారు. 52 రైస్​ మిల్లర్లకు ధాన్యం కేటాయించామని చెప్పారు. 64 మిల్లర్లతో మాట్లాడి అండర్​ టేకింగ్​  తీసుకుని వడ్లు తరలిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 29,378 టన్నుల సన్న, 27,630 టన్నుల దొడ్డు వడ్లను కొన్నామని, రూ.52.65 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.  ప్రతి మిల్లర్​ 5 వేల బస్తాల దొడ్డు వడ్లు తప్పనిసరిగా దించుకోవాలని ఆదేశించారు. బాయిల్డ్  రైస్  మిల్లులకు 60 శాతం దొడ్డు రకం, 40 శాతం సన్న రకం వడ్లు ఇస్తామన్నారు. డీఎస్​వో విశ్వనాథ్, డీఎం జగన్మోహన్ పాల్గొన్నారు.