జీవా ధోనికి అదనపు భద్రత: జార్ఖండ్ ప్రభుత్వం

జీవా ధోనికి అదనపు భద్రత: జార్ఖండ్ ప్రభుత్వం

క్రికెటర్ MS ధోని గారాల పట్టి జీవాపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన జార్ఖండ్‌ ప్రభుత్వం శనివారం అప్రమత్తమైంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని … ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. దీంతో పాటు రాంచీలోని ధోని ఇంటి దగ్గర జీవాకు రక్షణగా అదనపు భద్రతను కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

IPL 13 సీజన్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరి కారణంగానే… గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ  CSK  ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్‌ ఆటతీరుపై విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్‌ వీళ్లకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.