ఔటర్ సర్వీసు రోడ్లు..ఆగమాగం!

ఔటర్ సర్వీసు రోడ్లు..ఆగమాగం!
  • సరైన ఫెసిలిటీస్ లేక వాహనదారులకు ఇబ్బందులు
  • కనెక్టివిటీ లేదు.. ఇండికేషన్లు లేవ్
  • ఉన్నా కనిపించని సైన్ బోర్డులు
  • డెడ్​ఎండ్​లో కన్ఫ్యూజ్ అయి వెనక్కి వస్తున్న వెహికల్స్  
  • మరింత డేంజర్​గా మారిన ఒకే రూట్ సర్వీస్ రోడ్లు
  • చీకటి పడితే భయం భయంగా జనాల ప్రయాణం

హైదరాబాద్, వెలుగు : ఔటర్ రింగ్​రోడ్డు(ఓఆర్ఆర్) సర్వీసు రోడ్లను హెచ్ఎండీఏ పట్టించుకోవడంలేదు. ఓఆర్ఆర్158 కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. ఇరువైపులా ఉండాల్సిన సర్వీసు రోడ్లను కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మించలేదు. మహేశ్వరం, కండ్లకోయ రోడ్డు, ఘట్ కేసర్ రోడ్​ సమీపంలో, శంషాబాద్, హిమాయత్ సాగర్ తదితర ప్రాంతాల్లో ఒకే వైపు ఉన్న సర్వీసు రోడ్డులోంచే వాహనాలు వెళ్తున్నాయి. ఇలా  రాకపోకల కారణంగా మరింత డేంజర్​గా ఉంది.  ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. మరో వెహికల్​ని ఓవర్ టెక్ చేయడం పెద్ద సవాల్​గా మారింది.  దీంతో యాక్సిడెంట్లకు స్పాట్​గా తయారైంది. కొన్ని ప్రాంతాల్లో లైట్లు కూడా లేవు.  దీంతో చీకటి పడితే సర్వీసు రోడ్లపై వాహనదారులు ఇబ్బం
దులు పడుతూ వెళ్తున్నారు. కేవలం ఆదాయం వచ్చే టోల్ రోడ్లనే హెచ్ఎండీఏ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతుంది. కానీ సర్వీసు రోడ్లను పట్టించుకోవడంలేదు. ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చి 15 ఏళ్లు అయినా కూడా సర్వీసు రోడ్లపై వాహనదారులు సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి ఉంది. ఒకటి, రెండు చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో సర్వీసు రోడ్లను విస్తరించడంలేదు.  ఔటర్ పై ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినా, సర్వీసు రోడ్లపై అవి కనిపించవు. మొత్తంగా ఔటర్ రోడ్డు సర్వీస్ రోడ్లు పలు సమస్యలతో ఆగమాగంగా ఉన్నాయి.

లైటింగ్, సూచిక బోర్డుల్లేక..

ఔటర్​పై ఎల్ఈడీ  లైటింగ్ ధగధగలు ఉండగా.. సర్వీసు రోడ్లు చీకట్లు కమ్ముకున్నాయి. లైటింగ్ కూడా ఏర్పాటు చేయడంలేదు.  కొన్నిచోట్ల ఉన్నా వెలగడంలేదు. నార్సింగి నుంచి అప్పా జంక్షన్ వెళ్లే రూట్ లో రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా.. ప్రస్తుతం రాత్రిపూట వెళ్లాలంటే పెద్ద సవాల్​గా మారింది. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు కంటిన్యూటీ లేని ప్రాంతాల్లో సరైన సైన్ బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో డెడ్ ఎండ్​వరకు వాహనదారులు వెళ్లి వెనక్కి వస్తున్నారు. హిమాయత్ సాగర్​లో డైలీ 300 వరకు వాహనాలు ఇలా వెళుతూ 650 మీటర్లు వెనక్కి వచ్చి తిరిగిపోతున్నాయి. డెడ్​ఎండ్ సూచిక బోర్డు పెట్టినా అది చెట్ల కొమ్మల మధ్యలో ఉండి వాహనదారులకు కనిపించడంలేదు. అప్పా జంక్షన్ – పఠాన్ చెరువు– గచ్చిబౌలి వెళ్లేందుకు ఓఆర్ఆర్ ఎక్కే రోడ్లు కూడా కనిపించడంలేదు. మూలమలుపులో రోడ్డు ఉండటం, అక్కడ సూచిక బోర్డు కనిపించకపోవడంతో వాహనదారులు అటు ఇటు తిరుగుతున్నారు. నానక్ రాంగూడ వద్ద కూడా సర్వీసు రోడ్డు ఔటర్​కు ఆనుకొని ఉండటంతో అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్తున్నా కూడా తికమక పడుతున్నారు. ఇలా అన్నిచోట్ల పరిస్థితి ఉంది. రాత్రిపూట చివరి వరకు వచ్చి రోడ్డు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. కంటిన్యూటీ లేని రోడ్డు వద్ద సూచికబోర్డులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని వాహనదారులకు అంటున్నారు.

ఆదాయం వచ్చే రోడ్డుపైనే ఫోకస్

ఓఆర్ఆర్​పై జనాలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన హెచ్ఎండీఎ అసలు పట్టించుకోకుండా ఆదాయంపైనే ఫోకస్ పెట్టింది. అవసరమైన ప్రాంతాల్లో టోల్​ప్లాజాలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రూ.7,380 కోట్లకు టీవోటీ పద్ధతిలో 30 ఏళ్లపాటు ఔటర్ నిర్వహణను ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, దిగేందుకు మరిన్ని  టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ సర్వీసు రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్​ పెరిగిందని కొన్నిచోట్ల సర్వీసు రోడ్డును విస్తరిస్తున్నప్పటికీ కంటిన్యూటీ లేని చోట భూసేకరణ చేసి రోడ్లను పూర్తి చేయలేకపోతుంది. అన్నిచోట్ల ఇరువైపులా సర్వీసు రోడ్డు ఉంటే ఓఆర్ఆర్ పైన ప్రయాణించే వారితో పాటు కింది నుంచి వెళ్లే వారికి కూడా ఎలాంటి సమస్య ఉండదు. దీనిపై అధికారులు ఫోకస్ పెట్టడంలేదు. ఆదాయం వచ్చేదానిపై పెట్టిన ఇంట్రెస్ట్ సర్వీసు రోడ్డుపై ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఔటర్ పైకి ఎక్కేందుకు రోడ్డు కనిపిస్తలే..

ఔటర్ పైకి ఎక్కేందుకు రోడ్డు కనిపించడం లేదు. మూలమలుపులో ఉండటంతో అక్కడ సూచిక బోర్డు కూడా కనిపించడంలేదు. ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతాల్లో సర్వీసు రోడ్డు ఇరువైపులా లేదు. అక్కడక్కడ కనెక్టివిటీ లేకపోవడంతో అటు ఇటు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిచోట్ల జీపీఎస్ ఆధారంగా వెళ్లినా కూడా రూట్ కరెక్ట్ గా చూపించడంలేదు. రాత్రిపూట భయంగా ఉంటుంది. వచ్చే ప్రభుత్వమైనా ఔటర్ రోడ్డుని పట్టించుకోవాలె.
-ఎం. మణిదీప్, అప్పా జంక్షన్