ఇప్పటి వరకు నిద్రపోయారా? ఇన్నాళ్లకు సీబీఐ గుర్తుకొచ్చిందా?

ఇప్పటి వరకు నిద్రపోయారా?   ఇన్నాళ్లకు సీబీఐ గుర్తుకొచ్చిందా?
  • ఇప్పటి వరకు నిద్రపోయారా?   ఇన్నాళ్లకు సీబీఐ గుర్తుకొచ్చిందా?
  • మణిపూర్ లో ‘ఇండియా’ కూటమి ఎంపీల బృందం పర్యటన
  • రాజకీయాల కోసం కాదు.. శాంతిని నెలకొల్పేందుకే వచ్చామని ప్రకటన 
  • మణిపూర్’ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
  • కుకీలకు ప్రత్యేక పాలన వద్దంటూ మైతీల ర్యాలీ

న్యూఢిల్లీ/ఇంఫాల్:  మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఇన్ని రోజుల తర్వాత సీబీఐ దర్యాప్తు గుర్తుకొచ్చిందా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభ కాంగ్రెస్ సభా పక్ష నేత ఆధిర్ రంజన్ చౌధరి ఫైర్ అయ్యారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నిద్రపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆధిర్ రంజన్ ఆధ్వర్యంలో 21 మంది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీల బృందం మణిపూర్ చురాచాంద్ పూర్ జిల్లాలోని రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను పరామర్శించింది. ఈ సందర్భంగా ఆధిర్ రంజన్ మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాలు చేసేందుకు రాలేదని, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే వచ్చామని చెప్పారు. ‘‘మణిపూర్ లో తెగల మధ్య ఘర్షణలు రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి.

 రిలీఫ్ క్యాంపుల్లోని బాధితులతో, రెండు వర్గాల ప్రజలతో మాట్లాడి సమస్యను అర్థం చేసుకునేందుకు మేం వచ్చాం. రాష్ట్రంలో హింసకు ముగింపు పలికి, శాంతి నెలకొనేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన తెలిపారు. శనివారం ఉదయం w చేరుకున్న ఎంపీలు.. అక్కడి నుంచి చురాచాంద్ పూర్​కు హెలికాప్టర్ లో రెండు విడతలుగా రిలీఫ్ క్యాంప్​లకు వెళ్లి పరామర్శించారు. ఆధిర్ రంజన్ ఆధ్వర్యంలోని టీం చురాచాంద్ పూర్ బాయ్స్ కాలేజీ హాస్టల్​లోని రిలీఫ్ క్యాంప్​ను, లోక్ సభ కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ ఆధ్వర్యంలోని టీం ఇదే టౌన్ లోని డాన్ బాస్కో స్కూల్​లోని రిలీఫ్ క్యాంప్ ను సందర్శించాయి. 

ఎంపీల బృందంలో టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్, జేఎంఎం ఎంపీ మహువా మాజి, డీఎంకే ఎంపీ కనిమొళి, ఆర్ఎల్డీ ఎంపీ జయంత్ చౌదరి, శివసేన(యూబీటీ) ఎంపీ అర్వింద్ సావంత్, తదితరులు ఉన్నారు. ఎంపీల బృందం ఆదివారం ఉదయం ఇంఫాల్​లో గవర్నర్ అనుసూయ ఉయికేతో భేటీ అయి, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి బయలుదేరనున్నారు.  

సయోధ్యకు ప్రయత్నిస్తున్నాం: గవర్నర్ 

మణిపూర్​లో మైతీ, కుకీ తెగల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే చెప్పారు. శనివారం చురాచాంద్ పూర్ జిల్లాలోని ఓ రిలీఫ్ క్యాంప్​లో బాధితులను పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. ‘‘మైతీలు, కుకీల మధ్య విద్వేషాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. రెండు తెగల మధ్య సంబంధాలు మెరుగుపడేలా ప్రయత్నిస్తున్నాం” అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు సహకరించాలని ఇరువర్గాలకు విజ్ఞప్తి చేశారు.

మహిళల ఊరేగింపు ఘటనపై సీబీఐ దర్యాప్తు షురూ 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్​ మహిళల ఊరేగింపు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) శనివారం టేకోవర్ చేసింది. ఈ ఘటనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసును మణిపూర్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కోసం డీఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సీబీఐ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులను కూడా దర్యాప్తు టీంలో నియమించినట్లు చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తుండగా వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి, అతడి నుంచి సెల్ ఫోన్ ను రికవరీ చేశారు. నిందితులను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అలాగే సంఘటన స్థలానికి కూడా వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయనుంది.

వాళ్ల వేలిముద్రలు తీస్కుంటున్రు..  

మణిపూర్​లో అల్లర్లు, టెర్రరిజం, డ్రగ్ మాఫియా వెనక మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల పాత్ర కూడా ఉందన్న అనుమానాల నేపథ్యంలో వారి బయోమెట్రిక్ వివరాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను శనివారం ప్రారంభించామని, సెప్టెంబర్  చివరికల్లా పూర్తిచేస్తామని రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. మణిపూర్ లో ఇటీవల జరిగిన అల్లర్లలో ఏడుగురు మయన్మార్ దేశీయులు కూడా గాయపడ్డారు. వారికి గన్ ఫైర్, పేలుడు కారణంగా గాయాలు అయ్యాయి. కాగా, అక్రమ వలసదారుల బయోమెట్రిక్ వివరాలను  తీసుకోవాలంటూ మణిపూర్ తో పాటు మిజోరంను కేంద్రం ఇంతకుముందే ఆదేశించింది.