యాదగిరిగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 23న మొదలైన అధ్యయనోత్సవాలు ఆరు రోజుల పాటు వైభవోపేతంగా సాగాయి. చివరి రోజైన గురువారం నిర్వహించిన నరసింహస్వామి అలంకార సేవతో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆరు రోజుల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు.. చివరి రోజు లక్ష్మీనరసింహస్వామి అవతారంలో కనువిందు చేశారు. స్వామివారు ప్రధానాలయ తిరువీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చారు.

 అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ..వేదపండితుల వేదపారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య స్వామివారి అధ్యయనోత్సవాలకు ముగింపు పలికారు. ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం భక్తులకు లక్ష్మీనరసింహస్వామి అవతార విశిష్టతను వివరించింది.  

ఆర్జిత సేవలు షురూ  

గుట్టలో శ్రీవారి అధ్యయనోత్సవాల సందర్భంగా ఈ నెల 23 నుంచి28 వరకు తాత్కాలికంగా రద్దయిన ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి. ఆరు రోజులుగా నిలిచిపోయిన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు అర్చకులు చెప్పారు.