కిడ్నాప్ జరిగి 4 రోజులు.. కొనసాగుతున్న పోలీసుల సెర్చ్

కిడ్నాప్ జరిగి 4 రోజులు.. కొనసాగుతున్న పోలీసుల సెర్చ్
  • రిమాండ్ కు 32 మంది నిందితులు

రంగారెడ్డి జిల్లా: ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడ లో వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ జరిగి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ నిందితుడి ఆచూకీ దొరకలేదు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న శంషాబాద్ దగ్గర నవీన్ రెడ్డి కారును పోలీసులు గుర్తించి.. స్వాధీనం చేసుకోవడంతో నిందితులు దొరికినట్లేనని భావించారు. అయితే నిందితులు తెలివిగా కారు ఉపయోగిస్తే పట్టుపడడం ఖాయమని రెండు రోజుల క్రితమే శంషాబాద్ వద్ద ఉన్న పొలాల్లో కారు వదిలేసి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

కారు అక్కడ వదిలేసిన నిందితులు ఎక్కడికి వెళ్లి ఉంటారనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ వైపు అన్ని రూట్లలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దామోదర్ రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి నాలుగు రోజుల క్రితం సుమారు 100 మందితో కలిసి వైశాలి ఇంటికి వచ్చి..కుటుంబ సభ్యులను బెదిరించి ఆమెను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

వైశాలి ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ రెడ్డితో  కలిసి వచ్చిన మనుషులు ధ్వంసం చేశారు.దీనిపై మరో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చారు. నిందితుడు నవీన్ రెడ్డితో సంబంధాలున్న వ్యక్తులపై నిఘా ఉంచిన పోలీసులు.. అన్ని చోట్ల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

నవీన్ రెడ్డికి పోలీసులు సహకరిస్తున్నారు: కుటుంబ సభ్యుల ఆరోపణ

కిడ్నాప్ ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ డిపార్టుమెంట్ లో నిందితుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2019లోనే నవీన్ రెడ్డిపై ఛీటింగ్, ఐటీ సెక్షన్ల కింద కేసులు ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డితో కలిసి వైశాలి ఇంటిపైకి వచ్చిన 32 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రిమాండ్ కి తరలించారు. నవీన్ రెడ్డి పై గతంలో మూడు కేసులు ఉండగా.. యాక్సిడెంట్ కేసు కూడా నమోదైనట్లు గుర్తించారు. నవీన్ రెడ్డితోపాటు పరారైన నిందితుల కోసం ఉచ్చు బిగించిన పోలీసులు ఏ క్షణంలోనైనా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.