గాంధీ భవన్​కు టికెట్ల పంచాది.. కంది శ్రీనివాస్​కు టికెట్ ఇవ్వొద్దంటూ ఆదిలాబాద్ కార్యకర్తల ఆందోళన

గాంధీ భవన్​కు టికెట్ల పంచాది.. కంది శ్రీనివాస్​కు టికెట్ ఇవ్వొద్దంటూ ఆదిలాబాద్ కార్యకర్తల ఆందోళన
  • ఆయనది ఆర్ఎస్ఎస్ భావజాలమని సీనియర్ల విమర్శ
  • టికెట్ తనకే అంటూ ప్రచారంలో జోష్ పెంచిన కంది

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్  కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ గాంధీ భవన్ ను తాకింది. కంది శ్రీనివాస్  రెడ్డికి టికెట్  ఇవ్వొద్దంటూ ఆ పార్టీ కార్యకర్తలు శనివారం గాంధీ భవన్  ఎదుట ధర్నాకు దిగారు. ఎంతో కాలంగా పార్టీలో పనిచేస్తున్న వారికే టికెట్ కేటాయించాలని డిమాండ్  చేశారు. దీంతో టికెట్  విషయంలో అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొన్ని రోజులుగా ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్  కంది శ్రీనివాస్  రెడ్డికే వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టగా.. సీనియర్లు శనివారం మీడియా మందు తమ వైఖరిని మరోసారి తెలియజేశారు. పారషూట్  లీడర్లకు టికెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో టికెట్ హాట్ టాపిక్​గా మారింది. బోథ్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న నేతలందరూ సైలెంట్ అయిపోగా ఆదిలాబాద్ లో మాత్రం తీవ్ర దుమారం నెలకొంది. పార్టీలో చేరిన నెల రోజుల్లోనే సీనియర్ నాయకులతో గొడవలతో కంది శ్రీనివాస్  వివాదాల్లోకెక్కారు. ఎమ్మెల్యే టికెట్  తనకే వస్తుందంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను డీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారు.

మూకుమ్మడిగా విమర్శలు

బీజేపీ నుంచి కాంగ్రెస్  పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డి వస్తూనే సీనియర్లను కాదని సొంత నిర్ణయాలతో ముందుకెళ్లారు. దీంతో ఆయనపై సీనియర్లందరూ మూకుమ్మడిగా విమర్శలకు  దిగారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పార్టీలోకి వచ్చిన పారషూట్ లీడర్ కు టికెట్  ఇవ్వవద్దని మూడు నెలలుగా అధిష్టానానికి తమ గోడ వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. కందికే టికెట్ వస్తుందంటూ ప్రచారం జరుగుతుండటంతో మరోసారి టికెట్ల విషయంలో లొల్లి షురూ అయ్యింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్  ఆరు గ్యారంటీ పథకాలతో ప్రచారం చేస్తున్నా సీనియర్లందరూ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కందికి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానాన్ని కోరారు. 

అటు పార్టీ సెకండ్ క్యాడర్ లీడర్లు సైతం హైదరాబాద్ కు వెళ్లి ధర్నా చేశారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి పనిచేస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో టికెట్ల ప్రకటన రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎలక్షన్ల సమయానికి పార్టీలో ఎవరుంటారో ఎవరు కండువా మారుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.