ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నాలుగేండ్ల చిన్నారి ఆత్రం గంగామణి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. కిడ్నాప్‌కు గురైన చిన్నారిని ఆరు గంటల్లోనే గుర్తించిన పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో బుధవారం తల్లిదండ్రులు జంగు, కప్లీ బాయికి అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 28న రుయ్యాడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి చిన్నారిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొచ్చి బస్టాండ్ ప్రాంతంలో భారతి అనే మహిళకు అప్పగించింది. చిన్నారి కనిపించడం లేదంటూ బాలిక తల్లి మంగళవారం తలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదిలాబాద్ లోని మహాలక్ష్మి వాడలో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి 11 గంటలకు అక్కడికి చేరుకొని గంగామణిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన నాగుబాయి, భారతిని అరెస్ట్ చేశారు.
