
కనుచూపుమేర పచ్చని చెట్లు, దట్టమైన అడవి.. అక్కడక్కడా జలపాతాలు.. మధ్యమధ్యలో గిరిజన గూడేలు... ఇలాంటి అందాలు చూడాలంటే ఆదిలాబాద్ మన్యంలోకి వెళ్లాల్సిందే. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల, తలమడుగు మండలం కోసాయి అటవీ ప్రాంతాలు ఎత్తయిన కొండలు, పెద్ద పెద్ద లోయలు, సెలయేళ్లు, జలపాతాలతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దీంతో వీకెండ్ వచ్చిందంటే చాలు... ఈ అటవీ ప్రాంతాలన్నీ సందర్శకులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు ఇచ్చోడ మండలంలోని గుండివాగుపై సుమారు 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న గాయత్రీ జలపాతం చూపరులను కట్టిపడేస్తుంది. ఖండాల అటవీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్లు ఉండగా.. కోసాయి 28 కిలోమీటర్లు, గాయత్రి జలపాతం.. కుంటాల జలపాతం నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్