ఆ బ్రాండ్ విత్తనాలే కావాలి.. 55 రకాలున్నా ఒక్క సీడ్​ కోసమే రైతన్నల ఆరాటం..

ఆ బ్రాండ్ విత్తనాలే కావాలి.. 55 రకాలున్నా ఒక్క సీడ్​ కోసమే రైతన్నల ఆరాటం..
  •    అధిక డిమాండ్​తో రెండు ప్యాకెట్లే ఇస్తున్న ఆఫీసర్లు
  •    ఇదే అదునుగా బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యాపారులు 
  •    బంధువుల ఆధార్​ కార్డులతో విత్తనాలు తీసుకెళ్తున్న మహారాష్ట్ర రైతులు 

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా తెల్ల బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ 80 శాతం మంది రైతులు పత్తి పంటే సాగు చేస్తారు. ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు వేసుకుంటారు. ఈ ఏడాది కూడా రైతులు సాగుకు సిద్ధం కాగా, వారికి కావాల్సిన పత్తి విత్తనాలు దొరక్క వారం నుంచి పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఒకే బ్రాండ్ సీడ్ కోసం పట్టుబట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది.

రాశీ 659 విత్తనం వేస్తే అధిక దిగుబడి వస్తుందని ప్రచారం జరగడంతో ఆ సీడ్​ కోసం రైతులు గంటల తరబడి ఫర్టిలైజర్ షాపుల ఎదుట లైన్లు కడుతున్నారు. మిగతా రకాల విత్తనాలు సైతం మంచి దిగుబడులు ఇస్తాయని అధికారులు చెబుతున్నా వినడం లేదు. ఫలితంగా డిమాండ్ ఉన్న సదరు విత్తనాలు కావాల్సినన్ని దొరకడం లేదు. 

ఒకేరకం తెచ్చిన తంటా..

ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.87 లక్షల సాగు విస్తీర్ణం ఉండగా, 4.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. 70 వేల ఎకరాల్లో సోయాబీన్, 30 వేల ఎకరాల్లో మిగతా పంటలను రైతులు సాగు చేయనున్నారు. వారం రోజుల్లో పత్తి విత్తనాలు వేసుకునేందుకు రైతులు సిద్ధమై విత్తనాల కోసం జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. మెజార్టీ రైతులు ఒకే కరం విత్తనం కోసం వస్తుండడంతో ఫర్టిలైజర్ షాపుల ఎదుట లైన్లు పెరిగిపోతున్నాయి.

పిల్లలు, ఇంట్లోని మహిళలను కూడా తీసుకువచ్చి లైన్లు కట్టిస్తుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాశీ 659 రకం విత్తనాలు నల్లరేగడి భూముల్లో వేస్తే బుగ్గ పెద్దగా ఉంటుందని, ఎకరానికి 10 క్వింటాళ్లు వస్తుందని రైతులు చెబుతున్నారు. అందుకే ఎన్ని ప్యాకెట్లు దొరికితే అన్ని తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. రాశీ 659 రకం విత్తనాలు గతేడాది 1.25 లక్షల ప్యాకెట్లు వచ్చాయి.

ఇవి దాదాపు 60 వేల ఎకరాలకే సరిపోతాయి. ఈ ఏడాది సైతం సదరు కంపెనీ నుంచి అదే స్థాయిలో విత్తనాలు పంపిణీ స్తున్నారు. మిగతా 3.50 లక్షల ఎకరాల్లో వేరే రకం కంపెనీ పత్తి విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. అందుకోసం 55 కంపెనీల125 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవి వేసినా అధిక దిగుబడి వస్తుందని అధికారులు చెప్తున్నా రైతులు తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు.

మరోవైపు సమయానికి విత్తనాలు దొరుకుతాయో లేదోననే భయంతో రైతులు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఫర్టిలైజర్ ​షాపుల ఎదుట భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు 8 లక్షల విత్తనాల ప్యాకెట్లు రాగా..2.50 లక్షల విత్తనాలు అమ్ముడుపోయాయి. ఇందులో 50 వేల ప్యాకెట్లు రాశీ 659 రకమే  ఉన్నాయి. మరో రెండు రోజుల్లో 50 వేల ప్యాకెట్ల రాశీ విత్తనాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 

మహారాష్ట్ర రైతులు ఇక్కడికి..

ప్రతి ఏడాది డిమాండ్ రకం విత్తనాలు జిల్లాకు వచ్చినా అవి పూర్తి స్థాయిలో ఇక్కడి రైతులకు ఇవ్వకుండా మహారాష్ట్ర రైతులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంత మంది మహారాష్ట్ర రైతులు ఇక్కడున్న వారి బంధువుల పేర్లపై పత్తి విత్తనాల ప్యాకెట్లు తీసుకెళ్తున్నారని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఆధార్ కార్డుపై రెండు ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే ఇస్తున్నారు.

దీంతో కుటుంబంలోని ముగ్గురు, నలుగురు వచ్చి దుకాణాల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతోపాటు మహారాష్ట్ర రైతులు సైతం తమ బంధువుల ఆధార్ కార్డులతో విత్తనాలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో నకిలీ విత్తనాలు విక్రయిస్తారనే ఉద్దేశంతో అక్కడి రైతులు సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్​కు వస్తున్నారు. దీంతో డిమాండ్ రకం విత్తనాలకు మరింత కొరత ఏర్పడుతోంది.

దీనికి తోడు కొంత మంది వ్యాపారులు డిమాండ్​ ఉన్న రకం విత్తనాల స్టాక్ లేదంటూనే బ్లాక్​లో అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రాశీ 659 రకం విత్తన ప్యాకెట్ ధర ​రూ.864 ఉంది. కొంత మంది బ్రోకర్లు బ్లాక్ మార్కెట్​లో దీన్ని రూ. వెయ్యికి పైగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు బ్లాక్ దందాను కట్టడి చేయడంలో విఫలం కావడంతో తాము కష్టాలు పడుతున్నామని రైతులు అంటున్నారు.

సోయా సబ్సిడీ ఏదీ?

పత్తి విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతుండగా గత బీఆర్ఎస్​ప్రభుత్వం సోయాబీన్ విత్తనాల సబ్సిడీ విషయంలో చెయ్యివ్వడంతో నిరాశతో ఉన్నారు. రైతులకు సోయాబీన్ విత్తనాలపై అందిస్తున్న 33 శాతం సబ్సిడీని 2021లో బీఆర్​ఎస్​ ఎత్తేసింది. 25 కిలోల సోయాబీన్ బస్తా సబ్సిడీపై రూ.1200కు దొరికేది. సబ్సిడీ ఎత్తేయడంతో ప్రైవేట్ వ్యాపారు వద్ద రూ. 3,500కు కొనాల్సి వస్తోంది.

జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సోయాబీన్ ​సాగు చేస్తారు. ఈ ఏడాది కూడా 70 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం స్పందించి సోయాబీన్​పై సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.