ఆక్రమణలే ముంచాయి

ఆక్రమణలే ముంచాయి
  • నీట మునిగిన కాలనీలు
  • నాలాల ఆక్రమణలు, బఫర్ జోన్ లో నిర్మాణాలతోనే నష్టం
  • మున్సిపల్ అధికారుల సర్వేలో వెల్లడి
  • బఫర్ జోన్ నివాసాలకు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు 
  • లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు

ఆదిలాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఆదిలాబాద్ పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. గతంలో ఎన్నాడూ లేని విధంగా కాలనీలను వరద ముంచెత్తడంతో ఇండ్లు నీట మునిగాయి. ఆయా కాలనీల్లో నాలాల ఆక్రమణలతో పాటు చెరువులు, వాగుల సమీపంలో బఫర్ జోన్ లో భవన నిర్మాణాలు చేపట్టడమే కాలనీలు మునిగిపోవడానికి కారణమని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు  పేర్కొంటున్నారు. 

నీట మునిగిన 264 ఇండ్లు

వరద నష్టంపై కలెక్టర్ ఆదేశాల మేరకు రెండ్రోజులు పట్టణంలో సర్వే నిర్వహించగా.. దాదాపు 15 వార్డుల్లో 264 ఇండ్లు నీట మునిగినట్లు తేలింది. ఆక్రమణలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇరుకు నాలాలు, ప్రైవేట్ ఓపెన్ ప్లాట్ల కారణంగా కాలనీల్లోకి వరద వచ్చినట్లు సర్వేలో వెల్లడించారు. కొంత కాలంగా ఆదిలాబాద్ పట్టణంలో బఫర్ జోన్ లో పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. ఇటీవల భారీ వర్షానికి సుభాష్ నగర్ వాగు సమీపంలో మొదటి అంతస్తు వరకు ఇండ్లు నీట మునిగిపోయాయి. చాలా ఇండ్లు బఫర్ జోన్ పరిధిలోనే కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్ చెరువులో ఇండ్ల నిర్మాణాలు కూడా బఫర్ జోన్‌ లోనే ఉన్నట్లు తేలింది.

నష్టనివారణ చర్యలు

పట్టణంలో జరిగిన వరద నష్టంపై అంచనా వేసి శాశ్వత మార్గాలను అన్వేషించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆక్రమణలతో పాటు బఫర్ జోన్ పరిధిలో నివాసాలు, లోలెవల్ బ్రిడ్జిలతో వరదలు సంభవించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వరదలపై నష్టనివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. 

సుభాష్ నగర్, కోజా కాలనీ, దుర్గానగర్ ప్రాంతాల్లోని లో లెవల్ బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. వాగులు, చెరువుల సమీపంలో బఫర్ జోన్ (9 మీటర్ల లోపు) ఉన్న నివాసాలకు నోటీసులు జారీ చేయాలనిఆదేశాలు జారీ చేశారు. 

బఫర్ జోన్​ల నివాసాలు, నాలాల ఆక్రమించి  చేపట్టి నిర్మాణాలను గుర్తించి వాటికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకోసం మున్సిపల్, ఆర్అండ్ బీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఓ బృందంగా ఏర్పడి ఆక్రమణలను గుర్తించి, నివేదికను కలెక్టర్ కు అందజేయనున్నారు. సెప్టెంబర్ 10లోగా పూర్తి నివేదిక తయారు చేసిన అనంతరం మరోసారి ప్రత్యేక సమావేశంలో శాశ్వత చర్యలపై చర్చిస్తారు. 

ముంపు కాలనీలు ఇవే..

జిల్లా కేంద్రంలో వర్షాలు పడిన ప్రతిసారి వరదలతో పలు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ధస్నాపూర్, రాంనగర్, సాయినగర్ టీచర్స్ కాలనీ, టేలర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, రణదివే నగర్, గాంధీనగర్ మీదుగా దస్నాపూర్ వాగు చాందా టి వాగులో కలుస్తోంది. ఈ వాగుకు ఇరువైపులా 9 మీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్​గా నిర్ణయించినప్పటికీ అక్కడ నివాసాలు వెలుస్తున్నాయి. ఫలితంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి సమీపంలోని ఇండ్లలోకి వరద  చేరింది. భాగ్యనగర్, తాటి గూడ, తిలక్ నగర్ కాలనీలు నాలాలు ఆక్రమించడంతో వరద ప్రవాహంతో మునిగిపోతున్నాయి. ఖానాపూర్ చెరువు ఆక్రమణలకు గురవుతుండటంతో వర్షపు నీళ్లు ఇండ్లోకి వస్తున్నాయి. కుమ్మరికుంట, జీఎస్ ఎస్టేట్, గాంధీనగర్, మహాలక్ష్మీవాడ కాలనీలు సైతం నీట మునిగాయి.

ఆక్రమణలతోనే వరద

పట్టణంలో వదర నీరు ఇండ్లలోకి చేరడానికి ఆక్రమణలే కారణం. రెండు రోజుల పాటు సర్వే నిర్వహించి నివేదికను కలెక్టర్​కు అందించాం. ఖానాపూర్ చెరువు, సుభాష్ నగర్, కుమ్మరికుంట ప్రాంతాల్లో బఫర్ జోన్ లోనే నిర్మాణాలు వెలిసాయి. కొన్ని చోట్ల నాలాలు ఇరుకుగా ఉండటం, మరికొన్ని చోట్ల నాలాల ఆక్రమణతో ఇండ్లు మునిగాయి.     - రాజు, మున్సిపల్ కమిషనర్