చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటా : సోయం బాపూరావు

చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటా : సోయం బాపూరావు

కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్రు.. 

ఆదిలాబాద్ ​ఎంపీ సోయం బాపూరావు

భైంసా, వెలుగు : తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే పార్టీ మారుతున్నారనే దుష్ర్పచారం చేస్తున్నారని, చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటానని ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. శనివారం నిర్మల్​ జిల్లా భైంసాలో ఆయన పర్యటించారు. ముందుగా గడ్డెన్న ప్రాజెక్టు పక్కన గల గుట్టపై ఎంపీ ల్యాండ్స్​ కింద మంజూరైన రూ.10లక్షలతో గోశాల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అసెంబ్లీ ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇతర పార్టీల నేతలను ఎవరినీ కలువలేదని స్పష్టం చేశారు. తమ పార్టీలో ఉన్న కొందరు అపోహాలు సృష్టించడం సరికాదన్నారు. మీడియా కూడా ఆలోచించి వాస్తవాలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో మరో సారి కేంద్రంలో, ఇటు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల రాజన్న, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్, మోహన్​ రావు పటేల్, లీడర్లు బాజీరావు, ఏఎంసీ చైర్మన్​ రాజేశ్​ బాబు, లీడర్లు నారాయణ్ రెడ్డి, సాయినాథ్​, గోపాల్​ సార్డా, బాజీరావు, బాలాజీ, గోసంరక్షణ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.