ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మహర్దశ పట్టనుంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 52 అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని గత మే 17న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతోపాటు గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
