
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గణపతి మండప నిర్వహణ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. మండప నిర్వహణ కమిటీ సభ్యులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వివరాలను నమోదు చేసుకోవాలని, ఫలితంగా బందోబస్తు కేటాయిస్తామన్నారు.
భద్రత దృష్ట్యా ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వీలైంత వరకు ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో ఏర్పాటు చేసిన మండపాలకే అనుమతులున్నాయని, కొత్త వాటికి లేవని స్పష్టం చేశారు. అధిక శబ్దం చేసే డీసీలకు అనుమతి లేదన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, రూరల్ సీఐ ఫణిదర్, జైనథ్, ఇచ్చోడ సీఐలు సాయినాథ్, బండారి రాజు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.