- గంగాజల సేకరణకు మెస్రం వంశీయులు..
- జనవరి 14న తిరిగి కేస్లాపూర్ చేరుకోనున్న పాదయాత్ర
- 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర
ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరగనున్న నాగోబా జాతరలో ప్రధాన ఘట్టమైన గంగాజల సేకరణ మంగళవారం ప్రారంభమైంది. జనవరి 18న అమావాస్య రోజు అర్ధరాత్రి మహాపూజలతో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెస్రం వంశీయులు మంగళవారం గంగాజల సేకరణకు బయలుదేరారు.
ముందుగా కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్ద పీఠాధిపతి మెస్రం వెంకటరావు అధ్యక్షతను సమావేశమై గంగాజల సేకరణ పాదయాత్రపై చర్చించారు. అనంతరం మురాడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కేస్లాపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాగూడలో బస చేయనున్నారు.
బుధవారం చిలాటీగూడలో, జనవరి 1న నార్నూర్ మండలం మాన్కపూర్, 2న జైనూర్ మండలం మామడ, 3న జైనూర్ మండలం డబోలి, 4న సిర్పూర్(యు)మండలం దన్నోర, 5న జన్నారం మండలం ఇస్లాంపూర్, 6న దస్తురాబాద్ మండలం నర్సింగ్‌పూర్ చేరుకుంటారు.
7న జన్నారం మండలంలోని హస్తలమడుగుకు చేరుకొని గంగాజలాన్ని సేకరించి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేస్లాపూర్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. జనవరి 14న ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకొని అక్కడ ఇంద్రాదేవికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి అదే రోజు కేస్లాపూర్‌లోని మర్రిచెట్ల వద్దకు
చేరుకోనున్నారు.
జాతర ఏర్పాట్లు పూర్తి చేయండి
నాగోబా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ దర్బార్ సమావేశ మందిరంలో మంగళవారం రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు అవసరమైన అన్ని సౌలత్‌లు కల్పించాలని, దర్శనం టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రివ్యూలో ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ పంత్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
