ఆదిత్య L1 జర్నీ.. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం

ఆదిత్య L1 జర్నీ.. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం

ఆదిత్య ఎల్- 1 సెప్టెంబర్ 2 న ప్రయోగిస్తామని ఇస్రో ప్రకటించింది. అయితే ఆదిత్య  ఎల్ 1 ఏంటి శాటిలైట్  కక్షలోకి ఎలా ప్రవేశ పెడతారు.. ఏం చేస్తుందనేదానిపై చర్చ జరుగుతోంది. సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వార గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. 

ఆదిత్య-L1 మొత్తం  ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ) తోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ , ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ , ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య , సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు. 

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు.  ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌,క్రోమోస్పియర్‌,వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి

  • ఈ ఆదిత్య ఎల్ 1 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్న ప్రయోగం.   
  • ఈ శాటిలైట్ బరువు 1500 కిలోలు
  • ఆదిత్య L1లో ఏడు రకాల పరికరాలు అమర్చారు. ఇందులో నాలుగు పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి.
  • మరో మూడు పరికరాలు లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి.
  • ఈ ఏడు పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి.

ఆదిత్య అని పేరు ఎందుకు పెట్టారంటే?

త్వరలో నింగిలోకి వెళ్లే ఈ శాటిలైట్ నాలుగు నెలల ప్రయాణం తర్వాత తన నిర్ధిష్ట కక్ష్యలోకి వెళ్లబోతోంది. ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించింది కాబట్టి  దీనికి  ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర దీనిని ప్రవేశ పెట్టబోతున్నారు కాబట్టి ఈ మిషన్‌కి ఆదిత్య L1 అని పేరు పెట్టింది ఇస్రో.