ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి .. రాత్రిపూట మహిళల బైండోవర్పై మండిపడ్డ ఆదివాసి సేన

ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి .. రాత్రిపూట మహిళల బైండోవర్పై మండిపడ్డ ఆదివాసి సేన

దండేపల్లి, వెలుగు: మహిళలు అని కూడా చూడకుండా రాత్రి వేళ్లలో బైండోవర్ చేయడానికి ప్రయత్నించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేకు సంఘం నాయకులతో కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. దండేపల్లి మండలంలోని లింగాపూర్ రిజ్వర్ ఫారెస్ట్ 380 కంపార్ట్​మెంట్​లో దమ్మన్నపేట, మామిడిగూడ, తదితర ఆదివాసీ గిరిజన గూడలకు చెందిన మహిళలు చెట్ల పొదలు తొలగించారనే నెపంతో వారిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇదే అదునుగా రాత్రి వేళ్లలో గిరిజన గూడాలకు వెళ్లి మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిమండిపడ్డారు.

 సోమవారం రాత్రి మహిళలను తహసీల్దార్ ఆఫీస్ కు తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆటవిక చర్యలకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే గిరిజన మహిళలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్​చేశారు. సంఘం నాయకులు జంగు, జలపతి, ఆదిరావు, బుజంగరావు, లింగారావు, దీపారావు, గంగు, రాజేశ్, నారాయణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.