పట్టాలిస్తామని అప్లికేషన్లు తీసుకుని.. చప్పుడు చేస్తలే

పట్టాలిస్తామని అప్లికేషన్లు తీసుకుని.. చప్పుడు చేస్తలే
  • దున్నడానికి వీల్లేదంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు 
  • కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపుతలేరు
  • పైగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు
  • కూలీ చేసుకుందామన్నా పని దొరకని పరిస్థితి 
  • జిల్లాలో 11,251 పోడు అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌

నాగర్​కర్నూల్, ​వెలుగు: నల్లమల ప్రాంతంలోని అడవి బిడ్డలు అరకకు దూరం అవుతున్నారు. తాతల కాలం నుంచి దున్నుకుంటున్న భూముల్లోకి ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు అడుగుపెట్టనివ్వడం లేదు. కాళ్లావేళ్లా పడ్డా, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నా కనికరం చూపుతలేరు. పైగా అడ్డంగా కంచెలు పెట్టి కందకాలు తవ్వడంతో పాటు హరితహారం పేరిట మొక్కలు నాటుతున్నరు.  ఎవరైనా అడడ్డుకుంటే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. పట్టాలిస్తామని చెంచులు, గిరిజనులతో పాటు ఇతరుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న సర్కారు 9 నెలలైనా చప్పుడు చేయడం లేదు. పోనీ కూలీనాలి చేసుకొని పొట్టపోసుకుందామన్నా అటవీ ప్రాంతం కావడంతో పనిదొరకని పరిస్థితి నెలకొంది.   

జైలుకు పంపుతున్న ఫారెస్టోళ్లు..

అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో 70 చెంచు కుటుంబాలు ఉండగా.. 35 కుటుంబాలు  పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు.  గ్రామానికి చెందిన చెంచు దంపతులు నిరంజన్, లింగమ్మ నిరుడు జూలైలో భూమి దున్నుతుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. అడ్డుతిరిగిన వీళ్లు సిబ్బందిపై పెట్రోల్​చల్లడంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసు పెట్టి జైలుకు పంపించారు. 15 రోజులు  తర్వాత జైలు నుంచి రిలీజ్​అయ్యాక లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకుంది.  కొన్నాళ్లకే భర్త నిరంజన్​ కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. 40 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూమిలోకి రానివ్వడమే కాకుండా జైలుకు పంపి  తల్లిదండ్రుల ప్రాణం తీశారని  కొడుకు సైదులు కన్నీళ్లు పెట్టుకున్నాడు.  చేసేందుకు పనిలేక ఊరూరు తిరిగి బిచ్చం అడుక్కుంటున్నానని వాపోయాడు. ఇదే గ్రామానికి చెందిన లింగమ్మ, బుచ్చయ్య దంపతులు తమను పొలంలోకి రానివ్వకుండా ఫారెస్టోళ్లు అడ్డంగా ట్రెంచ్​తీశారని చెప్పారు. రెండేళ్ల కింద భూమిలోకి రామని చెప్పి ఇప్పుడేమో భూమిలేదు పొమ్మంటున్నారని బాధపడ్డారు. కూలీనాలి చేసుకుందామన్నా ఎక్కడా పని దొరకడం లేవని, నలుగురు పిల్లల్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.  ఇదే గ్రామంలో 2021 జులైలో పోడు భూములు దున్నారని నలుగురిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. 

మాధవాని పల్లిలో గుండెపోటుతో మహిళ..

గత ఏడాది అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన చారగొండ బాలమ్మకు చెందిన తాటిచెలుకల పొలంలో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు వెళ్లగా ఆమె అడ్డుకున్నది.  ఫారెస్ట్​ సిబ్బందితో పాటు మన్ననూర్ ఎఫ్‌‌‌‌డీవో ఆఫీస్‌‌‌‌కు వెళ్లి  సాయంత్రం వరకు ఎదురుచూసింది.  అధికారుల కాళ్లపై పడ్డా కనికరించక పోవడంతో మానసికంగా ఆవేదనకు గురై రాత్రి గుండె పోటుతో మృతి చెందింది.  బాలమ్మ  డెడ్‌‌‌‌బాడీతో ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా చేసేందుకు బంధువులు ప్రయత్నించగా లోకల్​ లీడర్లు సర్దిచెప్పారు.  అచ్చంపేట మండలం అంబగిరిలో గిరిజనులు సాగు చేస్తున్న15 ఎకరాల భూమిలో ఫారెస్ట్​ ఆఫీసర్లు మొక్కలు నాటారు.  

కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు..
కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ ముక్కిడిగుండం గ్రామానికి చెందిన 20 గిరిజన కుటుంబాలు 30 ఏళ్లుగా 20 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాయి.  ఐదేండ్ల కింద 20 మందిపై కేసులు నమోదు చేస్తే కోర్టుల చుట్టూ తిరిగి ఇటీవలే బయటపడ్డారు. గత  ఏడాది దున్నడానికి వెళ్తే ఫారెస్ట్​ సిబ్బంది రానివ్వలేదు.  గత బుధవారం కూడా పోడు భూములు సాగు చేసేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్నారు. తీవ్రవాగ్వాదం, తోపులాట మధ్య దేవి అనే గిరిజన మహిళ అక్కడే పురుగుల మందు తాగింది.  

9 నెలలాయే..
ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌లోని14 మండలాల్లో 93  జీపీల పరిధిలోని138 హ్యాబిటేషన్ల నుంచి 11,251 అప్లికేషన్లు తీసుకుంది. 18,413 ఎకరాల భూమికి పట్టాలివ్వాలని 5,400 మంది గిరిజనులు, చెంచులు, 5,900 మంది ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించేందుకు కమిటీలను ఏర్పాటు చేసిన సర్కారు.. సర్వే చేయడానికి ట్రైనింగ్​ఇస్తామని చెప్పింది. కానీ,  తొమ్మిది నెలలు దాటినా అప్లికేషన్ల ప్రోగ్రెస్ ఏంటో తెలియడం లేదు.  

పట్టాలివ్వాలి
 చెంచులు, గిరిజనులు ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూమికి పట్టాలివ్వకపోవడం సరికాదు. ఆర్‌‌‌‌‌‌‌‌వోఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ యాక్ట్​ ఎందుకు అమలు చేయడం లేదు.  అరుదైన చెంచుజాతిని కాపాడుకునే ప్రయత్నాలు జరగాలె.  పోడు భూములు గుంజుకోవడం మానేసి.. వారికి పట్టాలివ్వాలి. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- వంశీకృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్​.