Kane Williamson: సంతోషపడాలా..? బాధపడాలా..?: ఐపీఎల్‌లో విలియంసన్‌కు కొత్త బాధ్యతలు

Kane Williamson: సంతోషపడాలా..? బాధపడాలా..?: ఐపీఎల్‌లో విలియంసన్‌కు కొత్త బాధ్యతలు

ఐపీఎల్ లో ప్లేయర్ గా న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ కథ ముగిసినట్టుగానే కనిపిస్తుంది. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు విలియంసన్ ఐపీఎల్ లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు ఈ కివీస్ సూపర్ స్టార్ ను వ్యూహాత్మక సలహాదారుగా జట్టులో చేర్చుకుంది. గురువారం (అక్టోబర్ 16) విలియంసన్ ను తమ జట్టులో చేర్చుకున్నట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ అధికారికంగా ప్రకటించింది. LSG యజమాని సంజీవ్ గోయెంకా విలియమ్సన్‌ను జట్టులోకి స్వాగతిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. జహీర్ ఖాన్ స్థానంలో విలియంసన్ లక్నో బాధ్యతలు స్వీకరిస్తాడు.  

"కేన్ సూపర్ జెయింట్స్ జట్టులో భాగం. అతను లక్నో సూపర్ జయింట్స్ కు వ్యూహాత్మక సలహాదారుగా కొత్త పాత్రలో స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. అతని కెప్టెన్సీ, వ్యూహాత్మక అంతర్దృష్టి, ఆటపై లోతైన అవగాహన, ఆటగాళ్లను ప్రేరేపించే సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను". అని సంజీవ్ గోయెంకా రాసుకొచ్చాడు. ప్రస్తుతం విలియంసన్ ప్రపంచ క్రికెట్ లీగ్ లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ లో రాణించి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. గత సీజన్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఈ కివీస్ స్టార్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

అంతర్జాతీయ టీ20 లకు విలియమ్సన్ ఇంకా ప్రకటించకపోయినా.. పొట్టి ఫార్మాట్ లో ఇంకా ఫామ్ లోనే ఉన్నా వ్యూహాత్మక సలహాదారుగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 79 మ్యాచ్‌లు ఆడాడు. ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్ లు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ప్రేమగా 'కేన్ మామా' అని పిలువబడే విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఈ టోర్నీలో మొత్తం 735 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరిసారిగా 2024 ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున విలియంసన్ ఆడాడు.    


జహీర్ కు గుడ్ బై: 

జహీర్ ఖాన్ గతేడాది లక్నో మెంటర్‎గా బాధ్యతలు చేపట్టాడు. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‎ను ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధరకు (27 కోట్లు) కొనుగోలు లక్నో కొనుగోలు చేయడంలో జహీర్ కీలకంగా వ్యవహరించాడు. కానీ జహీర్ వ్యూహాలు ఫలించలేదు. గత సీజన్‎లో లక్నో కెప్టెన్‎గా, ఆటగాడిగా రిషబ్ పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. కానీ జహీర్ అమలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్‌ ఓపెనింగ్‌ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.

ఇదే సమయంలో లక్నో బౌలింగ్ దళం పూర్తిగా తెలిపోవడంతో ఆ జట్టు 14 మ్యాచుల్లో కేవలం ఆరు విజయాలకే పరిమితమై ఏడో స్థానంలో నిలిచింది. 2022లో ఐపీఎల్‎కు ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫస్ట్ రెండు సీజన్లు ప్లే ఆఫ్స్‎కు చేరుకుంది. కానీ జహీర్‎ను మెంటర్‎గా తీసుకున్న సీజన్‎లో ఆ జట్టు పూర్ ఫెర్మాఫెన్స్ చేసింది. 7వ స్థానంలో నిలిచి కనీసం ప్లే ఆఫ్స్‎కు చేరుకోలేకపోయింది.

దీంతో జహీర్‎ పని తీరుపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. అదే సమయంలో గోయెంకా, లక్నో కోచ్ లాంగర్ తీరుపై కూడా జహీర్ కు నచ్చలేదని సమాచారం. ఈ కారణంతోనే లక్నో జట్టుకు జహీర్ వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. లక్నో గుడ్ చై చెప్పిన జహీర్.. వచ్చే ఏడాది ఏ జట్టుతో జత కడతారో చూడాలి.