భారత న్యాయ వ్యవస్థలో కోర్టులు, అధికారులు: రాజ్యాంగంలో న్యాయస్థానాల ప్రస్తావన..

భారత న్యాయ వ్యవస్థలో కోర్టులు, అధికారులు: రాజ్యాంగంలో న్యాయస్థానాల ప్రస్తావన..

సుప్రీంకోర్టు, హైకోర్టులు కేంద్ర జాబితాలో ఉన్నాయి. దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలన్నీ హైకోర్టుల  పర్యవేక్షణాధికార పరిధిలో ఉండి పనిచేస్తాయి. రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాల గురించి కూడా ప్రస్తావించారు. 

జిల్లా సెషన్స్ కోర్టు: హైకోర్టు తర్వాత స్థానంలో జిల్లా స్థాయిలో ఉండే కోర్టును సెషన్స్ కోర్టుగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది. జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తుల ఎంపిక, నియామకం గవర్నర్ నిర్ణయిస్తారు. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి గవర్నర్ న్యాయమూర్తులను నియమిస్తారు. 
*దిగువ న్యాయస్థానాల్లో కనీసం 7 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. 
*రాష్ట్ర హైకోర్టు సిఫారసును అనుసరించి నియామకం చేస్తారు. 
*జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు నుంచి ఉరిశిక్ష వరకు విధించవచ్చు. అయితే మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే అమలు చేయాలి. 

సబార్డినేట్ కోర్ట్ 
జిల్లా సెషన్స్ కోర్టు కంటే కింది స్థాయిలో ఉండే కోర్టులను సబ్​కోర్టులుగా పేర్కొంటారు. సబ్​కోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర న్యాయసర్వీసుకు సంబంధించిన అధికారుల నియామకంలో గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర హైకోర్టులను సంప్రదించిన అనంతరం నియమిస్తారు. 
*ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. 


మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్
సబ్​కోర్టు కంటే దిగువస్థాయిలో ఉన్న న్యాయస్థానాలను మున్సిఫ్​ మెజిస్ట్రేట్ కోర్టులుగా భావిస్తారు. న్యాయసర్వీస్ విభాగం ద్వారా నిర్వహించే పరీక్షల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు ఈ న్యాయమూర్తుల నియామకంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
*మూడు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. 

మెట్రోపాలిటన్ కోర్ట్
అధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాల్లో సిటీ సివిల్ కోర్టులు అంటే జిల్లా సెషన్స్ కోర్టు స్థాయిలో విచారిస్తుంది. అలాగే క్రిమినల్ కేసులను విచారించడానికి జిల్లా స్థాయిలో పనిచేసే సెషన్స్​కోర్టు మాదిరిగానే మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులు ఏర్పడి పనిచేస్తున్నాయి. 

లోక్​అదాలత్ (ప్రజా న్యాయస్థానం) 
దేశంలో న్యాయవ్యవస్థ ముందు పేరుకుపోయిన కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ వివాద విచారణ  పద్ధతిని ప్రవేశపెట్టడంలో భాగంగా లోక్​అదాలత్ విధానాన్ని 1987లో ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని 39 (ఏ) అధికరణ ప్రకారం ఉచిత న్యాయసేవా సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో 1987లో లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. కేసులను మధ్యవర్తిత్వం ద్వారా అంటే రాజీమార్గం ద్వారా ఇరువర్గాల సమ్మతితో పరిష్కరించే ఈ కేసు విషయంలో లోక్​అదాలత్ ఇచ్చే తీర్పులు అంతిమం అంటే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అవకాశం లేదు. 

2002లో లీగల్ ఎయిడ్ అథారిటీ చట్టానికి సవరణలు చేసి లోక్​అదాలత్​లను శాశ్వత పద్ధతి ద్వారా ఏర్పాటు చేశారు. జిల్లా సెషన్స్​కోర్టు న్యాయమూర్తి లేదా అదనపు న్యాయమూర్తి చైర్మన్​గా ఉంటారు. ప్రజాసేవలో నిష్ణాతులైన ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా ప్రభుత్వం నియామకం చేయవచ్చు. 

దేశంలోని ఉన్నతన్యాయస్థానాలు మొదలుకుని జిల్లా సెషన్స్ కోర్టు, సబ్​కోర్టు, మున్సిఫ్​కోర్టులు కూడా లోక్​అదాలత్​లను నిర్వహించవచ్చు. ఇందులో ముఖ్యంగా మోటారు వాహనాలకు సంబంధించిన కేసులు, బ్యాంక్ లోన్​లు , వివాహ సంబంధ వివాదాలు, భూసేకరణ మొదలైన అంశాలను లోక్​అదాలత్​లు పరిష్కరిస్తాయి. 

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
* దేశంలో చాలాకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసుల త్వరితగతిన విచారణ, పరిష్కారం కోసం 11వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2000లో భారతదేశంలో ఫాస్ట్​ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. 

*2010లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న వీరప్పమొయిలీ పార్లమెంట్​లో ప్రకటన చేస్తూ దేశం మొత్తం అంటే సుప్రీంకోర్టును మొదలుకుని దిగువ న్యాయస్థానాలకు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో కేసుల సంఖ్య 3.10 కోట్లు. పెండింగ్​లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతోనే 2000లోనే మన దేశంలో 492 ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం తన నిధులతో ఫాస్ట్​ట్రాక్ కోర్టులను నిర్వహించే విధానాన్ని 2011, మార్చి 31 నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఖర్చులతో ఫాస్ట్​ట్రాక్ కోర్టులను నిర్వహిస్తున్నాయి. 

ఫ్యామిలీ కోర్టులు – 1984 
*కుటుంబ సంబంధ వివాదాలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో 1984లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేశారు. 
*వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన అంశాలపై తలెత్తే సివిల్ వివాదాలను పరిష్కరించే నేపథ్యంలో ఈ కోర్టులను ఏర్పాటు చేశారు. 
*సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో కౌన్సెలింగ్ ను కూడా ఒక సాధనంగా ఈ కోర్టులు వినియోగిస్తాయి. 
*మాజీ క్రికెటర్ దాల్వీర్ సింగ్ కేసులో గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టు 2014లో భార్యనే భర్తకు భరణం చెల్లించాలనే అరుదైన తీర్పును ఇచ్చింది.


గ్రామ న్యాయాలయ చట్టం-2008 
ఎల్.ఎం.సింఘ్వి కమిటీ మన దేశంలో స్థానిక కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. చిన్న కేసులను తక్కువ ఖర్చుతో సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో న్యాయపంచాయతీలను ఏర్పాటు చేశారు. 2008లో భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అనుసరించి మన దేశంలో 5,067 న్యాయపంచాయతీలను ఏర్పాటు చేశారు. ఇవి  2009, అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఈ న్యాయస్థానాలు గ్రామీణ సంచార న్యాయస్థానాలుగా పనిచేస్తాయి. 

*గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని 1986లో జస్టిస్ ఎ.డి.దేశాయ్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ తన 114వ నివేదికలో సూచించింది. 
*ఈ చట్టం జమ్మూకాశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్​ప్రదేశ్ రాష్ట్రాలు, ఆదివాసీ ప్రాంతాలు మినహా మిగతా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. 
*సహజ న్యాయాన్ని , హైకోర్టు రూపొందించిన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని గ్రామ న్యాయాలయాలు తీర్పునిస్తాయి.
*గ్రామ న్యాయాలయ చట్టం–2008 ప్రకారం దేశంలోని వివిధ గ్రామాల్లో సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తారు. ఈ న్యాయస్థానాల్లో విచారణను ఫస్ట్​క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిర్వహిస్తాడు. 
*హైకోర్టులను సంప్రదించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ న్యాయాలయాలకు న్యాయాధికారులను నియమిస్తాయి. 

విచారించే కేసులు 
క్రిమినల్, సివిల్ కేసులను, మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, రెండు సంవత్సరాలకు పైబడి శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులను మినహాయించి మిగిలిన అన్ని రకాల వివాదాలపై విచారణ నిర్వహిస్తాయి. దొంగతనం, దొంగతనం చేసిన వస్తువులను కొనడం, దొంగతనం చేసిన వస్తువులను లేదా ఆస్తిని దాచడం లేదా దాచడంలో సహకరించడం, ఆస్తి కొనుగోలు, భూమిని సాగు చేసుకోవడం మొదలైన కేసులను విచారిస్తాయి. 

గ్రామ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులను సవాల్ చేస్తూ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నది. అప్పీలు దాఖలు చేసిన ఆరు నెలల్లోగా సెషన్స్ కోర్టులు విచారణ జరిపి తీర్పు చెప్పాల్సి ఉంటుంది.