కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా : విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా : విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడబెట్టిన అక్రమాస్తులపై విచారణ కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ధర్మారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ 2004లో ఎమ్మెల్యేగా గెలవకముందు ఎన్ని ఆస్తులు ఉండేవో, ఇప్పుడు రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడో విచారణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురిలో ఎందుకు జరగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కమీషన్లు తీసుకోవడానికి తప్ప మంత్రి పదవితో ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు. పదేళ్లలో ధర్మారం మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదని, తాము తొలి విడతలోనే 584 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, లీడర్లు సూర్యనారాయణ, దేవీ జనార్ధన్, తిరుపతి, చిరంజీవి పాల్గొన్నారు.