
- అప్ గ్రేడ్ అయి 8 నెలలైనా వీసీ లేరు, రిజిస్ట్రార్‌ను అపాయింట్ చేయలె
- వంద కోట్లిస్తనన్న మాటే మర్చిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది తెలంగాణ మహిళా యూనివర్సిటీ పరిస్థితి. రాష్ట్రం వచ్చిన 8 ఏండ్ల తర్వాత ఏర్పాటు చేసిన వర్సిటీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్గ్రేడ్చేసి 8 నెలలు దాటింది. అయితే, కాలేజీ పేరు యూనివర్సిటీగా మారిందే తప్ప.. పరిస్థితులు మాత్రం ఎప్పట్లాగే ఉన్నాయి. బడ్జెట్లో వందకోట్లు కేటాయించారు గానీ, ఇప్పటివరకు ఒక్కపైసా రిలీజ్ చేయలేదు. అంతకుముందు నుంచి ఉన్న సిబ్బందితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. అకడమిక్ ఇయర్ ముగిసే సమయం వస్తున్నా, ప్రభుత్వం వర్సిటీపై కనీసం రివ్యూ కూడా చేయలేదు.
అంతకుముందున్న సిబ్బందితోనే..
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ పోయినేడాది ఏప్రిల్ నెలాఖరులో సర్కారు జీవో 12 రిలీజ్ చేసింది. 2022–23 బడ్జెట్లో వంద కోట్లు కేటాయించింది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారిక జీవోను ఓయూ వీసీ రవీందర్, కాలేజీ ప్రిన్సిపల్ విజ్ఞులతకు అందించి, త్వరలోనే వసతులు కల్పిస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. కానీ, కాలేజీ అప్పుడెలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. ఈ అకడమిక్ ఇయర్ నుంచే మహిళా వర్సిటీ పేరుతో యూజీ, పీజీ కోర్సుల్లో ఫస్టియర్ అడ్మిషన్లు జరిగాయి. అంతకుముందున్న సిబ్బందితోనే వర్సిటీని నడిపిస్తున్నారు. మహిళా వర్సిటీ డెవలప్ మెంట్ కోసం విద్యాశాఖ అధికారులు పలు ప్రతిపాదనలు చేసినా.. సర్కారు దాన్ని పక్కన పడేసినట్టు తెలుస్తోంది. 4వేలకు పైగా స్టూడెంట్లున్న ఆ కాలేజీలో, సరపడా హాస్టల్ ఫెసిలిటీ లేదు.
సిబ్బంది విభజన కాలె
ప్రస్తుతం కోఠి ఉమెన్స్ లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉస్మానియా వర్సిటీకి చెందిన వారు. కాలేజీ వర్సిటీగా అప్‌గ్రేడ్ కావడంతో.. వారందరికీ ఉమెన్స్ వర్సిటీలో పనిచేసే ఆప్షన్ ఇస్తారు. వారి అభిప్రాయం మేరకు అలాట్మెంట్ జరుగుతోంది. ఆ తర్వాత ఉమెన్స్ వర్సిటీలో ఖాళీలపై క్లారిటీ రావచ్చు.సిబ్బంది విభజన జరగాల్సి ఉన్నా, నోడల్ ఆఫీసర్‌నూ నియమించకపోవడంతో ప్రక్రియ పెండింగ్‌లో పడింది.
వర్సిటీ ప్రతినిధి ఒక్కరూ లేరు
ప్రస్తుతం మహిళా వర్సిటీ కింద ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. వర్సిటీగా అప్‌గ్రేడ్ అయ్యాక స్పెషల్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ ను సర్కారు నియమించలేదు. వర్సిటీకి వైస్ చాన్సలర్ గానీ, రిజిస్ట్రార్‌ని గానీ నియమించలేదు. ఇన్చార్జ్ బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు. ప్రత్యేకంగా ఆఫీసర్‌ను నియమిస్తే.. సర్కారు ఇస్తామన్న వంద కోట్ల కోసం అప్పుడప్పుడైనా సెక్రటేరియట్చుట్టూ తిరిగేవారు. వాళ్లూ లేకపోవడంతో ఎవ్వరూ వంద కోట్ల మాటే తీయడం లేదు. దీంతో వర్సిటీని పెట్టి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.