
జీఎస్టీ సంస్కరణలు భావితరానికి మేలుచేసేవిధంగా ఉంటాయని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన కొత్త రేట్లతో చేనేత రంగాన్ని పెనంలో నుంచి పొయ్యిలోకి నెట్టినట్లు అయ్యింది. ఎన్నడూ లేని విధంగా చేనేత మీద జీఎస్టీ పన్ను వేస్తున్న కేంద్ర ప్రభుత్వం దాని వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేకపోగా పన్ను వలన, అధికారుల వలన చేనేత రంగం నష్టపోతున్నది అని అనేకసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదు.
సామాన్యుల మీద జీఎస్టీ పన్ను భారం ఉండదని ప్రధాని మోదీ ప్రకటించినా వాస్తవానికి చేనేత మీద పన్ను మొత్తం 60 లక్షల మంది ఉపాధిని, సంప్రదాయ వృత్తిని ప్రమాదంలోకి నెట్టింది. ట్రంప్ వాణిజ్య సుంకాల వల్ల నష్టపోతున్న రంగాలలో చేనేత రగ్గులు, తివాచీల పరిశ్రమ కూడా ఉన్నది. భారత ఎగుమతుల మీద 50 శాతం సుంకం విధిస్తే, దానికి సరైన విరుగుడుగా ప్రధాన మంత్రి స్వదేశీ నినాదం ఎత్తుకున్నారు.
స్వ దేశీ వస్త్ర ఉత్పత్తి మూలస్తంభం అయిన చేనేత మీద జీఎస్టీ ఎత్తివేయకుండా పెంచడం వల్ల చేనేతకు నష్టం వాటిల్లుతున్నది. స్వదేశీ వస్త్రం అంటే చేనేత. అటువంటి స్వదేశీ వస్త్రాన్ని వినియోగదారులు కొనలేని పరిస్థితి కొత్త జీఎస్టీ వల్ల ఉత్పన్నం అవుతున్నది. స్వదేశీ ఉత్పత్తులకు తలమానికం అయిన చేనేత, ఇతర చేతివృత్తులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు.
చేనేత కుటుంబాలపై జీఎస్టీ భారం
జీఎస్టీ2.0లో చేనేతకు ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. ఇదివరకు వేస్తున్న పన్ను రేట్లు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక మార్పుల వల్ల చేనేత మీద పన్ను రేటు 12 శాతం నుంచి 18 శాతం పడుతున్నది. కొత్త జీఎస్టీ ప్రకారం వస్త్రాలు కొనేటప్పుడు మొత్తం బిల్లు రూ.2,500 లోపు ఉంటే 5 శాతం పన్ను, అది దాటితే 18 శాతం పడుతుంది.
ఇదివరకు మొత్తం బిల్లు రూ.1,000లోపు ఉంటే 5 శాతం పన్ను, దాటితే 12 శాతం పడేది. ఇప్పుడు తగ్గించినం కదా అంటున్నారు. కాని కిటుకు ఇక్కడే ఉన్నది. చేనేత చీర ధర రూ.2,500 లోపు ఉండేది చాలా తక్కువ. కంచి, బెనారస్, పోచంపల్లి, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల రకాలు ఏవైనా రూ.2,500 లోపు ధర ఉండదు.
దీనితో చేనేత చీరల మీద జీఎస్టీ పన్ను విధిగా 18 శాతం పడుతున్నది. ఇప్పటికే నకిలీలతో, తక్కువ ధరకు ఇమిటేషన్ చీరలతో పోటీపడుతున్న చేనేత వస్త్రాలు ఇకముందు ఇంకా ఖరీదు కానున్నాయి. కొనేవాళ్ళు లేనప్పుడు పెట్టుబడి కూడా తగ్గుతుంది. చేనేత కుటుంబాలకు పని దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడబోతున్నది.
స్వదేశీ వస్త్రం అంటే చేనేత
కేంద్రం చేనేత రంగంతో పోటీపడుతున్న కృత్రిమ నూలు మీద పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించింది. పత్తి మీద 5 శాతం అట్లాగే ఉన్నది. అయితే, కృత్రిమ నూలు వస్త్రాలు ఇప్పటికే తక్కువ ఖరీదుకు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గనున్నాయి. పాలిస్టర్ చీరలు ఇప్పటికే సూరత్ నుంచి కిలోల లెక్కన మార్కెట్లో వస్తున్నాయి.
సహజ నూలు మీద లక్షల మంది రైతులు, వివిధ వృత్తులతోపాటు చేనేత రంగం ఆధారపడి ఉన్నది. కృత్రిమ నూలు, కృత్రిమ నూలుతో నేసిన వస్త్ర పరిశ్రమ ఆధునికం కాబట్టి ఉపాధి కూడా తక్కువే. స్వదేశీ వస్త్రం అంటే చేనేత. స్వదేశీ ఉత్పత్తుల చేసే కార్మికుల చెమట సువాసనగా ఇటీవల తన ప్రసంగంలో అభివర్ణించారు ప్రధాని మోదీ. అధిక పన్ను వల్ల చేనేత రంగ కార్మికులకు పనిలేక చెమటపట్టే అవకాశం లేకపోతున్నది.
పత్తి ఉత్పత్తిలో భారత్ రెండోస్థానం
పత్తి ఉత్పత్తి కృత్రిమ నూలుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయంగా తక్కువ. భారత దేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచస్థాయిలో రెండో స్థానంలో ఉంది. 2008లో జరిగిన ఉత్పత్తి 5 బిలియన్ కేజీలు. పత్తి నూలు, ప్రత్తి ఆధార వస్త్ర ఉత్పత్తిలో కూడా అగ్రగామి. 17 మిలియన్ కేజీల ఉత్పత్తి ద్వారా సిల్క్ లో కూడా రెండోస్థాయిలో, జనపనార ఉత్పత్తి 1.7 బిలియన్ కేజీలతో ప్రపంచంలో మొదటి స్థాయిలో ఉంది. ఈ విధంగా జౌళిరంగంలోని అన్ని ఉపరంగాలలో భారత దేశం స్థానం చాలా అత్యున్నత స్థాయిలోనే ఉన్నది.
ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులు చేసే సామర్థ్యం పూర్తిగా, సమగ్రంగా లేదు. అన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులలో సంపూర్ణంగా ముడిపదార్థాల ఉత్పత్తినుంచి, వాటిని ఉపయోగించి తయారుచేసే జౌళి ఉత్పత్తుల దాక భారత దేశం అగ్రగామిగా కొనసాగుతున్నది.
భారత జౌళి రంగంలో కనీసం 10 కోట్ల మంది కేవలం సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. సహజ ఫైబర్ ఉత్పత్తులలో పత్తి, సిల్క్, జూట్, ఉన్ని, అరటి వంటి అనేక రకాల వ్యవసాయ పంటలున్నాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులనుంచి నార తీసి, నూలు తయారుచేసే కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఈ నూలు నుంచి జౌళి, వస్త్రాలు తయారు చేసే చేనేత పారిశ్రామికులు, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి.
చేనేత పరిశ్రమ కుదేలు
గత 30 ఏళ్ళ విధానపర వివక్షతో కుదేలైన చేనేత పరిశ్రమ, దాని మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు పెంచిన జీఎస్టీ ఒక గొడ్డలిపెట్టు. పన్ను భారం మోయలేని స్థితికి చేరుకున్నది. సహజ నూలు మీద కూడా పన్నులు కట్టాల్సి వస్తున్నది. పూర్తిగా కృత్తిమ నూలు ఉత్పత్తికి, పాలియెస్టర్ వస్త్ర పరిశ్రమకు ప్రయోజనం జీఎస్టీ వల్ల సాధ్యపడుతున్నది.
ఎంఎంఎఫ్ ఉత్పత్తుల మీద అదనపు ట్యాక్స్ పడే అవకాశం జీఎస్టీలో లేదు. సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద మాత్రం 5 లేదా 18 శాతం వరకు భారం పడుతున్నది. దీని వలన, దాదాపు పది కోట్ల చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాలకు పని దొరకదు. వారి ఆదాయం మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది.
చేనేత పరిశ్రమ మొదటి నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఎప్పటికప్పుడు పెరుగుతున్న సహజ నూలు ధరలు. అన్ని రకాల సహజ ఫైబర్ నూలు ఉపయోగించి అనేక రకాల జౌళి ఉత్పత్తులను తయారుచేసే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉన్నది. ఈ నిజాన్ని ప్రభుత్వం
విస్మరించడం విస్మయం కలిగిస్తున్నది.
జీఎస్టీ నుంచి చేనేత వస్త్రాలను మినహాయించాలి
జీఎస్టీ వల్ల కృత్రిమ నూలుకు, పాలియస్టర్ వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సహించే విధానం వల్ల సహజ నూలు వస్త్రాల ధరలు పెరిగి అధికశాతం ప్రజలు వాటినికొనే స్థోమత కోల్పోతారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా కనుమరుగు అవుతుంది. వస్త్ర దిగుమతులు పెరుగుతాయి. దేశీయ జౌళి పరిశ్రమ ప్రమాదంలో పడుతుంది. జౌళి రంగంలో జీఎస్టీ పైన విస్తృత చర్చలు చేయాల్సిన అవసరం ఉంది.
చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు, పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చేయాలి. మన దేశీయ జౌళి రంగం ప్రాశస్త్యం సహజ నూలు ఉత్పత్తులు కనుక వీటిని ప్రోత్సహించేలా వ్యూహాలు రూపొందించాలి.
మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా జౌళి ఉత్పత్తులకు లేబులింగ్ చట్టం తీసుకురావాలి. సహజ నూలుకోరకు ఒక నిధిని ( నేచురల్ ఫైబర్ ఫండ్) ఏర్పాటు చేయాలి. నూలు ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
జీఎస్టీ మినహాయింపుల జాబితాలో చేనేత ఉత్పత్తులు, సహజ నూలు వస్త్రాలు, దుస్తులను విధిగా చేర్చాలి. ఈ దిశగా చేనేత వ్యాపార వర్గాలు, చేనేత కార్మికులు, కుటుంబాలు, చేనేత వినియోగదారులు, దేశీయ పరిశ్రమ కోసం పాటుపడే వర్గాలు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
- డా. డి. నరసింహరెడ్డి, చేనేత, జౌళి విధాన నిపుణుడు-