తిండి కల్తీలో రాష్ట్రం టాప్!...ఫుడ్ సేఫ్టీ ర్యాంకుల్లో అట్టడుగుకు..

తిండి కల్తీలో రాష్ట్రం టాప్!...ఫుడ్ సేఫ్టీ ర్యాంకుల్లో అట్టడుగుకు..
  • ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడి
  • ఫుడ్ క్వాలిటీ చెకింగ్స్ కూడా లేవ్  
  • రాష్ట్రంలో 50 మందే ఫుడ్ ఇన్​స్పెక్టర్లు   
  • ఆరేండ్లయినా కల్తీ కట్టడికి చట్టం తేలే 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉన్నదన్నట్టు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్.. ఆరేండ్లయితున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీపైనా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్ లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాల బారినపడుతున్నారు. 

ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లేవ్.. 

ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ మన రాష్ట్రం వెనుకబడింది. ఇందులో 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ క్వాలిటీ చెకింగ్ ఉండటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని స్లాటర్​హౌస్ కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ రోజుకు 3 వేల గొర్రెలను కోస్తారు. ప్రతిరోజూ ఇక్కడ ర్యాండమ్ గా మాంసానికి క్వాలిటీ టెస్టులు చేయాలి. కానీ నామమాత్రంగానే టెస్టులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

కంప్లయింట్స్ వచ్చినా స్పందిస్తలేరు.. 

కల్తీ ఫుడ్ పై కంప్లయింట్స్​వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్​కు ప్రతినెలా పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా, వాటిపై అధికారులు అంతంతమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. జనం ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పుడప్పుడు పోలీసులే దాడులు చేసి ఫుడ్ కల్తీ చేస్తున్నా ముఠాలను పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు 50 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 26 మంది ఉండగా, మిగిలిన జిల్లాల్లో 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వేలకొద్దీ పుట్టుకొస్తున్న స్ర్టీట్​ఫుడ్​సెంటర్లు, హోటళ్లలో ఫుడ్ క్వాలిటీ చెకింగ్ గగనమైపోయింది. ఫుడ్ ఇన్ స్పెక్టర్లను నియమించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

టెస్టింగ్ ల్యాబ్ లను వాడుకుంటలే.. 

ఉమ్మడి ఏపీలో 2008లో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్స్​అథారిటీ (అపెడా) క్వాలిటీ అసెస్మెంట్​ల్యాబ్​ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఎక్విప్ మెంట్ కోసం రూ. 1.20 కోట్లు కూడా మంజూరు చేసింది. టెస్టింగ్, ల్యాబ్ నిర్వహణకు సర్కార్ కొన్ని నిధులు ఖర్చు చేస్తే.. పాలు, మాంసం, గుడ్లు, ఇతర ఉత్పత్తుల క్వాలిటీని ఎప్పటికప్పుడు టెస్టు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ల్యాబ్​ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాచారంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన టెస్టింగ్​సెంటర్​ను కూడా వినియోగించుకోవడం లేదు. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, మసాలాల్లో కల్తీని గుర్తించేందుకు హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ లో టెస్టింగ్​ఫెసిలిటీ ఉంది. అలాగే హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఎక్విప్ మెంట్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.1.25 కోట్లు ఇచ్చింది. కానీ, ఈ ల్యాబ్ లను ప్రభుత్వం వాడుకోవడం లేదు.

2017లో కేసీఆర్​ ఏమన్నారంటే..

‘ఫుడ్ కల్తీ చేసేటోళ్లపై పీడీ యాక్టు కేసులు పెట్టి జైలుకు పంపుతం. ఇందుకోసం కఠిన చట్టం తెస్తం. అంతకంటే ముందు ఆర్డినెన్స్‌‌ జారీ చేస్తం. ఫుడ్ ఇన్​స్పెక్టర్లను నియమిస్తం. అల్లం, వెల్లుల్లి వంటివి రైతులతో పండించి.. ప్రాసెస్ చేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరు మీద అమ్మాలి. ఏ ఆహారమైనా కల్తీ చేస్తే ఉక్కుపాదం మోపాలి. కల్తీ చేయాలంటేనే వెన్నులో భయం పుట్టాలి’ అని 2017 మేలో ఉన్నతాధికారులతో రివ్యూలో సీఎం కేసీఆర్ అన్నారు.

కల్తీకి కాదేదీ అనర్హం..

రాష్ట్రంలో పాలు, అల్లం వెల్లుల్లి, వంట నూనె, మసాలాలు.. ఇలా ప్రతిదీ కల్తీ అవుతున్నది. రాష్ట్రంలోని వంట నూనెల శాంపిల్స్​ను టెస్టు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. అవి క్వాలిటీ ప్రమాణాల మేరకు లేనట్లు తెలిపింది. ఇక పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి స్పెషల్​డ్రైవ్ కింద 120 శాంపిల్స్​సేకరించి పరిక్షించగా, అందులో 34 శాంపిల్స్ ఫుడ్ క్వాలిటీ ప్రమాణాల మేరకు లేనట్లు తేలింది. పాలలో ఫ్యాట్ రేషియో, ఎస్ఎన్ఎస్ రేషియో, మిల్క్ ప్రొటీన్ రూల్స్ మేరకు లేవని వెల్లడైంది. కొన్నింటిలో ప్యాకెట్ లేబుల్ మీద ఉన్నట్లుగా.. పాలలో ప్రమాణాలు ఉండటం లేదని తేలింది. మిస్ బ్రాండింగ్ చేస్తున్నట్లు గుర్తించింది. 
ఇటీవల బయటపడిన కల్తీ ఫుడ్ ఘటనల్లో కొన్ని..

  • బియ్యం పిండితో దనియాల పొడి, జంతన్‌‌ గమ్​తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను మల్కాజ్‌‌గిరి ఎస్‌‌వోటీ పోలీసులు ఈ నెలలో అరెస్టు చేశారు.  
  • హైదరాబాద్ శివారులోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 
  • బొమ్మలరామారం, బీబీనగర్‌‌, భువనగిరి, భూదాన్‌‌ పోచంపల్లి మండలాల్లో యథేచ్ఛగా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు వివిధ ప్రాంతాల్లో కొందరు పట్టుబడ్డారు. 
  • ఈ నెల మొదటి వారంలో జీడిమెట్ల, షాపూర్​లో కల్తీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న ముఠా బయటపడింది. అంతకుముందు చందానగర్​లోనూ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ పేరుతో నాసిరకంవి అమ్ముతున్నట్టు గుర్తించారు. 
  • అత్తాపూర్​లో రసాయనాలు, సిట్రిక్ యాసిడ్ కలిపి చాక్లెట్లు తయారు చేస్తున్న ముఠాను ఏప్రిల్ లో పోలీసులు పట్టుకున్నారు.