
- తాగి, సోలిపోతున్న గిరిజనులు
- డిపోలు ఎత్తివేయాలని గిరిజన సంఘాల ఆందోళనలు, పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు ఏజెన్సీ గ్రామాలకు సైతం కల్తీ కల్లు పాకింది. బినామీల పేరుతో లైసెన్స్ లేకుండా కొంత మంది వ్యాపారులు అక్రమంగా కల్లు అమ్ముతున్నారు. ఈత, తాటి చెట్లు లేకున్నా, కెమికల్ కలిపిన కల్లు తయారు చేసి అమాయక ఆదివాసీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తాంసి, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్, ఇందన్ పల్లి, జన్నారం, లక్సెట్టిపేట, దండేపల్లి, నిర్మల్, ఖానాపూర్, కడెం, బైంసా ఏజెన్సీ మండలాల్లోని చాలా గ్రామాల్లో వెలిసిన కల్లు డిపోల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి.
నిబంధనలు పాటించట్లే..
కల్లు దుకాణం ఎక్కడైనా పెట్టాలంటే 30 చెట్లు ఉండాలి, చెట్టు ఎక్కి కల్లు తీయడం రావాలి, స్థానికులకు మాత్రమే దుకాణం నడిపేందుకు అనుమతులు ఇస్తారు. కానీ, ప్రస్తుతం జిల్లాలో 80 మంది వ్యాపారులు ఎలాంటి అర్హతలు లేకున్నా దుకాణాలు నడుపుతున్నారు. అసలైన గీత కార్మికుల కంటే ఈ దందాపై ఆధారపడ్డ బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఏజెన్సీలో గిరిజనేతరులకు లైసెన్సులు ఇవ్వరాదు.
కానీ, గిరిజనుల పేరుతో బినామీగా వ్యాపారులే కల్లు దుకాణాలు నడిపిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తారనే విమర్శలున్నాయి. ఈక్రమంలో ఏజెన్సీతో పాటు పల్లెల్లోని కల్లు దుకాణాలను తొలగించాలని గ్రామీణ ప్రాంత ప్రజలు, గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు.
అంతా కల్తీ మయం..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కెమికల్స్తోనే కల్లు తయారు చేస్తున్నారు. క్లోరో హైడ్రేట్, ఆల్ఫజోలం కలిపి కల్లు తయారు చేసి అమ్ముతున్నారు. రూ.10 మొదలు కొని రూ.100 వరకు ప్యాకెట్ల రూపంలో కల్లు విక్రయిస్తున్నారు. ఇలా రసాయానాలు కలిపిన కల్లు తాగడం వల్ల మెదడుపై ప్రభావం పడి వింతగా ప్రవర్తిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాపారులు హైదరాబాద్, నిజామాబాద్ తో పాటు మహారాష్ట్ర నుంచి క్లోరోహైడ్రేట్, ఆల్ఫజోలం దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల టాస్క్ ఫోర్స్ దాడులతో నిర్మల్ జిల్లాలో 2 క్వింటాళ్ల కెమికల్స్ పట్టుబడ్డాయి. హైదారాబాద్ కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు దుకాణాలపై దాడులు చేసి 100 కేసులు నమోదు చేశారు. ఏడు లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేశారు. కల్లు దుకాణాల నుంచి శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిస్తున్నారు.
మూడు నెలల కింద ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లో కల్తీ కల్లు అమ్ముతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా బట్టి సావర్గాం, యాపల్ గూడ గ్రామాల్లో కల్లు అమ్ముతున్న వీడీసీపై కేసు పెట్టారు. తంతోలి, బంగారిగూడ, బృందావన్ కాలనీ, చిట్యాల బోరి గ్రామాల్లో ఒకే రోజు దాడుల చేసి కల్తీ కల్లు విక్రయిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
గతంలో ఉట్నూర్ మండలం మత్తడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దగూడలో కల్తీ కల్లు తాగి మోహపత్ రావు అనే గిరిజనుడు చనిపోయాడు. ఇప్పటికీ చాలా మంది ఏజెన్సీలో కల్తీ కల్లు బారిన పడి రోగాల పాలవుతున్నారు.
ఇటీవల ఖోడద్ గ్రామంలో రోడ్డుపై నిర్వహిస్తున్న దుకాణంలో కల్తీ కల్లు తాగిన వ్యక్తులు బైక్పై వెళ్తూ ఎదురుగా బైక్పై వస్తున్న భీంరావును ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణంపై దాడి చేసి కేసు నమోదు చేశారు.
గత నెలలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కల్లు బట్టీలో రసాయనాలు కలిపిన కల్తీ కల్లు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. స్వామి అనే వ్యక్తిపై వన్ టౌన్ పోలీస్స్టేషన్ లో కేసు నమోదైంది.
కెమికల్స్ కలిపితే కఠిన చర్యలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలపై నిఘా పెట్టాం. ఇప్పటికే చాలాచోట్ల కల్లు దుకాణాల్లో శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించాం. కెమికల్స్ కలిపిన కల్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు 100 కేసులు నమోదు చేశాం. కల్లుతో పాటు గుడుంబా, దేశీదారు అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - రఘురాం, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జిల్లా కల్లు సొసైటీలు సభ్యులు
ఆదిలాబాద్ 10 29
మంచిర్యాల 109 1742
నిర్మల్ 54 741
ఆసిఫాబాద్ 24 192
వీటితో పాటు ట్రీ ఫర్ ట్యాపర్స్ స్కీం కింద కల్లు విక్రయాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 380 దుకాణాలకు, 1,324 మందికి లైసెన్సులు జారీ చేశారు.