
- రూ.22 కోట్లతో మంజీరాపై బ్రిడ్జి నిర్మాణం
- 2021లోనే పనులు పూర్తి
- మెదక్ జిల్లా వైపు అప్రోచ్‌రోడ్డు నిర్మించలే..
- ఇది పూర్తయితే కామారెడ్డి–మెదక్జిల్లాల మధ్య ఈజీగా రాకపోకలు
మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజల సౌకర్యార్థం మంజీరాపై సర్కార్బ్రిడ్జి నిర్మించింది. అయితే బ్రిడ్జిపై రాకపోకలకు వీలుగా రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా, ఒకవైపు మాత్రమే పూర్తయింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ముందస్తు ప్లానింగ్ లేకుండా పనులు చేపట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కారణంగా రూ.కోట్లు ఖర్చుపెట్టి బ్రిడ్జి కట్టినా ఉపయోగం లేకుండా పోయింది. మంజీరా మీద బ్రిడ్జి పూర్తయితే రాకపోకలకు తిప్పలు తప్పుతాయనుకున్న రెండు జిల్లాల ప్రజలకు నిరాశే మిగిలింది.
50కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
మెదక్ జిల్లాలోని పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల ప్రజలు.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాలకు వెళ్లాలంటే మెదక్ పట్టణం మీదుగా 50 కి.మీ.లకు పైగా తిరిగి వెళ్లాలి. దీనివల్ల విలువైన టైం, ఇంధనం ఖర్చవుతోంది. దీంతో మంజీరాపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం మెదక్–కామారెడ్డి జిల్లాల సరిహద్దులో రాంతీర్థం, వెంకంపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది.
2017లో మంజూరు...
ఎన్నో ఏండ్ల తర్వాత ఎట్టకేలకు 2017లో పాపన్నపేట మండలం రాంతీర్థం, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి మధ్య మంజీరాపై బ్రిడ్జి మంజూరైంది. ఇందుకోసం సర్కార్ రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఆర్అండ్‌బీ ఆధ్వర్యంలో పనులు చేపట్టగా 2021 ఆరంభంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. వెంకంపల్లి వైపు నది ఒడ్డు నుంచి తాండూర్ మీదుగా ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. కానీ ఇవతలి వైపు మెదక్ జిల్లా పరిధిలో రాంతీర్థం వద్ద బ్రిడ్జి దగ్గరి నుంచి పాపన్నపేట వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు. మంజూరైన రూ.22 కోట్లు బ్రిడ్జి నిర్మాణం, అవతలివైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చయిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జికి, ఇరువైపులా అప్రోచ్ రోడ్డుకు, అవసరమైన భూసేకరణకు ఎన్ని నిధులు అవసరం అవుతాయనేది సరిగా అంచనా వేయకపోవడంతోనే ఫండ్స్ ఖర్చయి, ఇవతలి వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టలేని పరిస్థితి నెలకొంది.
ఇంకో రూ.22కోట్లు కావాలి..
మంజీరా మీద నిర్మించిన బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించాలంటే మరో రూ.22 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రాంతీర్థం నుంచి పాపన్నపేట వరకు 4.4 కిలోమీటర్లు అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రూట్లో 1.6 కిలోమీటర్లు ఆర్అండ్‌బీ రోడ్డు, 0.7 కిలోమీటర్లు పీఆర్ రోడ్డు ఉండగా, మరో 2.1 కిలోమీటర్లు కొత్తగా రోడ్డు వేయాల్సి ఉంది. దీనికోసం 12 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు తేల్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి, భూసేకరణకు రూ.22 కోట్లు అవసరం ఉన్నాయి. ఈ నిధులు మంజూరై, భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే మంజీరా మీద నిర్మించిన బ్రిడ్జి వినియోగంలోకి వస్తుంది.
ఎవరూ పట్టించుకుంటలే..
మంజీరా మీద బ్రిడ్జి పూర్తయి రెండేండ్లు అయితాంది. ఇవతలి వైపు రోడ్డు వేయకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. అటు నాగిరెడ్డిపేట దిక్కు రోడ్డు పనులు కంప్లీట్అయినయి. కానీ ఇటు దిక్కు ఎందుకు చేస్తలేరో అర్థమైతలేదు. ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు ఎవరూ పట్టించుకుంటలేరు.
- ఈశ్వరప్ప, రాంతీర్థం
ప్రపోజల్స్ పంపించాం
మెదక్- కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో రాంతీర్థం - వెంకంపల్లి మధ్య మంజీరాపై నిర్మించిన బ్రిడ్జి పూర్తయింది. వెంకంపల్లి సైడ్ అప్రోచ్ రోడ్డు, బీటీ రోడ్డు పని కూడా అయిపోయింది. పాపన్నపేట సైడ్ ల్యాండ్ సర్వే చేశాం. రాంతీర్థం, ముద్దాపూర్ గ్రామాల మధ్య నుంచి 3.1కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.22 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం. ఫండ్స్ మంజూరు కాగానే రోడ్డు పనులు చేపడుతాం.
- వెంకటేశం, డీఈఈ, ఆర్అండ్‌బీ, మెదక్