హైదరాబాద్ సిటీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆలిండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి నాయకులు కోరారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సహజ వనరుల పరిరక్షణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌ప్రతాప్‌శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, సలహాదారు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, మాజీ ప్రధాన కార్యదర్శి పీవీ.రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాజారావు నేతృత్వంలోని బృందం సభ్యులు ఆదివాసీ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఇసుక తవ్వకాలు, వచ్చిన ఆదాయం, ఆదివాసీల అభివృద్ధికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ఆదివాసీ కుటుంబాలకు పూర్తి పునరావాసం, నష్టపరిహారం కల్పించాలని చెప్పారు. ‘మా ఊర్లో.. మా రాజ్యం’ స్ఫూర్తితో పెసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. కోయ, కోయతూర్ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని, ఆదివాసీలకు ప్రత్యేక మత కోడ్ కల్పించాలని కోరారు.
గిరిజన ప్రాంతాల్లో లభించే ఖనిజాలు, అటవీ సంపద ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన వాటాను స్థానిక ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని తెలిపారు. లోక్ భవన్‌లో ప్రత్యేక గిరిజన సెల్ ఏర్పాటు చేసి పంచమ షెడ్యూల్డ్ అమలును పర్యవేక్షించాలని గవర్నర్‌ను కోరారు.
