కాళేశ్వరం అక్రమాలపై..విచారణ చేయండి : రాపోలు భాస్కర్

కాళేశ్వరం అక్రమాలపై..విచారణ చేయండి : రాపోలు భాస్కర్
  • ఏసీబీకి అడ్వొకేట్ ఫిర్యాదు
  •     నకిలీ ఎస్టిమేట్లతో రూ.వేల కోట్ల అక్రమాలు చేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరపాలని అడ్వకేట్ రాపోలు భాస్కర్ గురువారం ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేట్లతో రూ.వేల కోట్ల అక్రమాలు చేశారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ కృష్ణా రెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.

ఉమ్మడి ఏపీలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఏడు లింకుల్లోని 28 ప్యాకేజీల్లో పనులు చేసేందుకు వర్క్ ఏజెన్సీలతో అప్పటి ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకొని కొంతమేరకు పనులు కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరంగా మార్చి, అంచనాలు భారీగా పెంచారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.