ఆఫ్ఘాన్లోహిమపాతం.. కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

ఆఫ్ఘాన్లోహిమపాతం..  కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

కాబూల్: అఫ్గానిస్తాన్‌‌లోని నూరిస్తాన్‌‌ ప్రావిన్స్ లో  భారీ హిమపాతం(అవలాంచీ) కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో  25 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. దాదాపు 20 ఇండ్లు ధ్వంసమయ్యాయి. టాటిన్ లోయలోని నక్రే గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

నూరిస్తాన్ ప్రావిన్స్ అంతా  పర్వత అడవులతో ఉంటుందని తెలిపారు. హిందూ కుశ్ పర్వత శ్రేణి దక్షిణ చివరకు ఆనుకొని ఉన్నందునా ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని వివరించారు. ఆదివారం రాత్రి మంచు ఎక్కువగా కురవడంతో  కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. 

సహాయక చర్యలకు ఆటంకం

నూరిస్తాన్‌‌ ప్రావిన్స్ లో మంచు ఎక్కువగా కురుస్తున్నదని ప్రావిన్స్‌‌ పబ్లిక్ వర్క్స్ హెడ్ మహ్మద్ నబీ అడెల్ తెలిపారు. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోవడంతో ఘటనా స్థలానికి వెహికల్స్ వెళ్లలేకపోతున్నాయని చెప్పారు. వర్షాల కారణంగా హెలికాప్టర్​ను కూడా పంపలేకపోతున్నామని వివరించారు. మంచువల్ల రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమైనప్పటికి తక్కువ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.