వీడియో: కాబూల్‌ ఎయిర్‌‌పోర్టులో పసికందును కాపాడిన యూఎస్ ఆర్మీ

వీడియో: కాబూల్‌ ఎయిర్‌‌పోర్టులో పసికందును కాపాడిన యూఎస్ ఆర్మీ

అఫ్గానిస్థాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిన నాటి నుంచి ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దేశంలో ఇక తమకు రక్షణ ఉండదన్న భయంతో విదేశాలకు వెళ్లిపోవాలని జనం ఎయిర్‌‌ పోర్టులకు పరుగులు తీస్తున్నారు. కాబూల్‌ ఎయిర్‌‌పోర్టుకు శనివారం మరోసారి వందల సంఖ్యలో జనం వచ్చారు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో తోపులాట జరిగింది. ఆ సమయంలో తొక్కిసలాట వల్ల తమ బిడ్డకు ఏమవుతుందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఆ పసికందును చేతుల్లో పైకెత్తి పట్టుకున్నారు. ఆ పసివాడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో గేటు సమీపంలో ఉన్న అమెరికా మెరైన్ సోల్జర్స్‌ సాయం కోసం వేడుకున్నారు. ఆ చిన్నారి కష్టాన్ని చూసి సైనికుడి గుండె కదిలిందేమో.. చేయి ముందుకు చాచి వాడిని అందుకుని అక్కున చేర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలను లాలిస్తున్న సోల్జర్స్

శనివారం కాబూల్ ఎయిర్‌‌పోర్టులో సైనికులు కాపాడిన చిన్నారిని తన తండ్రికి అప్పగించినట్లు యూఎస్ మెరైన్‌ కార్ప్స్‌ ప్రతినిధి మేజర్ జేమ్స్‌ స్టేంజర్ తెలిపారు. ఆ తోపులాటలో నుంచి కాపాడిన పసివాడికి మెడికల్‌ సిబ్బంది ట్రీట్‌మెంట్‌ అందించారని, ఆ తర్వాత ఆ పిల్లాడి తండ్రికి అప్పజెప్పామని, ఎయిర్‌‌పోర్టులో వాళ్లు సేఫ్‌గా ఉన్నారని చెప్పారు. కాబూల్ ఎయిర్‌‌పోర్టులో ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్న తమ ఆర్మీ సోల్జర్స్ ఈ క్లిష్ట పరిస్థతుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పని చేస్తున్నారన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న గత వారం రోజుల నుంచి ఇలాంటి హృదయ విదారక వీడియోలు, ఫొటోలు అనేకం బయటికొస్తున్నాయి. తప్పిపోయిన పిల్లలను, ఇలా తోపులాటలో కాపాడి ట్రీట్‌మెంట్ అందించిన పిల్లలను యూఎస్ ఆర్మీ సోలర్జ్స్‌ లాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొంత మందిని వాళ్ల పేరెంట్స్‌కి అప్పగించగా, ఇప్పటికీ కొందరి తల్లిదండ్రుల ఆచూకీ తెలియక రెస్క్యూ క్యాంపుల్లోనే ఉన్నారు.