తాలిబన్ హర్రర్: కాబూల్‌లో గుక్కపట్టి ఏడుస్తున్న 7 నెలల చిన్నారి..

తాలిబన్ హర్రర్: కాబూల్‌లో గుక్కపట్టి ఏడుస్తున్న 7 నెలల చిన్నారి..

కాబూల్: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ చేతిలోకి తీసుకున్న తర్వాత ఆ దేశ ప్రజల దీనావస్థను కళ్లకు గట్టే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న వందల, వేల మంది ఆ దేశాన్ని వదిలి వెళ్లేందుకు  కాబూల్‌ ఎయిర్‌‌పోర్టులోకి దూసుకెళ్లిన దృశ్యాలు, రన్‌ వేపై వెళ్తున్న ఫ్లైట్ వెంట జనాలు పరిగెడుతున్న వీడియోలు, ఫ్లైట్‌ రెక్కలు పట్టుకుని అది టేకాఫ్ అయ్యాక కిందపడి మరణించిన అభాగ్యులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. గతంలో తాలిబన్లు సృష్టించిన అరాచకాలు మళ్లీ ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు. ఇలా జనాలు కాబూల్ ఎయిర్‌‌పోర్టులో ఒక్కసారిగా నిన్న గుంపులు చేరిన క్రమంలో ఒక చిన్నారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. దీనికి సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాలిబన్ దురాగతాలకు.. లోకం తెలియని ఆ పసికందు ఒంటరైన తీరు చూస్తే ఎవరికైనా మనసు చలించేలా ఆ ఫొటో ఉంది.

నిన్న ఎయిర్‌‌పోర్టులో జరిగిన తోపులాటల్లో ఏడు నెలల చిన్నారి.. తల్లిదండ్రుల నుంచి వేరుపడింది. ఓ ప్లాస్టిక్ టబ్‌లో గుక్కపట్టి ఏడుస్తున్నట్టుగా కనిపిస్తున్న ఆ పసికందు ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అయితే కాబూల్‌కు చెందిన పీడీ5 ఏరియాకు చెందిన తల్లిదండ్రులు తమ చిన్నారి కనిపించడం లేదంటూ అఫ్గాన్‌కు అస్వాకా న్యూస్ ఏజెన్సీకి మొర పెట్టుకున్నారు. తమ బిడ్డ ఎవరికైనా దొరికితే తెచ్చివ్వాలని ఆ చానెల్ లైవ్‌లో బోరున విలపించారు. దీంతో ఆ పాపను, తల్లిదండ్రులను కలిపేందుకు తాము సాయం చేస్తున్నామని అస్వాకా న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఆ పాపను ఎవరైనా గుర్తిస్తే తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ముందుకు రావాలని కోరింది.