భారత్లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత​.. అసలు కారణం ఇదేనా..?

భారత్లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత​.. అసలు కారణం ఇదేనా..?

భారత్‌లో ఇవాళ్టి (అక్టోబర్‌ 1) నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్​ తమ దేశం పట్ల ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న అఫ్గానిస్థాన్‌.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొన్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వివిధ కోణాల్లో ఆలోచించే భారత్‌లో తమ దౌత్యపరమైన కార్యకలాపాలు నిలిపివేసినట్లు వివరించింది. అందుకు తామెంతో చింతిస్తున్నట్లు కూడా పేర్కొంది. 

న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం  కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరమని ఆఫ్ఘన్ అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయన్నారు.  ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. 

ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్‌కు వెళ్లి, యూఎస్‌ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు.