
- రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన ఆత్రం లచ్చన్న, భార్య అంకుబాయి
- రూ.25 లక్షల చొప్పున రివార్డు అందజేత
మంచిర్యాల/గోదావరిఖని, వెలుగు: మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న(65), ఆయన భార్య, జిల్లా కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయి(55) మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.25 లక్షల రివార్డు చెక్కులను సీపీ అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్న ఆదరణ గురించి తెలుసుకొని, తమ కుటుంబీకులతో ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్లు సీపీ తెలిపారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరపున పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొంత కాలంగా మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్లు పూర్తిగా నిలిచిపోయాయని, వారి సిద్ధాంతాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. ప్రజా సంఘాల ముసుగులో దందాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంచలంచెలుగా ఎదిగిన లచ్చన్న..
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపెల్లి గ్రామానికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరి మొదట చెన్నూర్ దళంలో పనిచేశాడు. 1988లో ఏరియా కమిటీ మెంబర్ గా ప్రమోషన్ పొంది సిర్పూర్(టి) దళ డిప్యూటీ కమాండర్‌గా పని చేశాడు. ఆ తర్వాత 1995లో పార్టీ లచ్చన్నను టెక్నికల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసి పట్టణ ప్రాంత కార్యకలాపాలు అప్పగించింది. 2002లో డీసీఎంగా ప్రమోషన్ కల్పించి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) టెక్నికల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. 2007లో నార్త్ బస్తర్ డీవీసీ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్చార్జిగా నియమించింది. 2023లో డీకేఎస్జడ్సీ మెంబర్‌గా ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు. ఆయనపై తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 35 కేసులు ఉన్నాయి.
1988లో అడవిబాట పట్టిన అంకుబాయి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఆగర్‌గూడ గ్రామానికి చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో 1988లో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరింది. సిర్పూర్ దళంలో పని చేస్తున్న సమయంలో అక్కడ డిప్యూటీ కమాండర్‌గా ఉన్న లచ్చన్నను పెండ్లి చేసుకున్నారు. 1995లో భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయిన అంకుబాయి 2002లో ఏసీఎంగా డీకేఎస్జడ్సీ టెక్నికల్ డిపార్ట్మెంట్కు వెళ్లింది. 2007లో నార్త్ బస్తర్ డీవీసీ టెక్నికల్ డిపార్ట్మెంట్కు బదిలీపై వెళ్లి అక్కడే పని చేస్తోంది. ఆమెపై ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.
సొంత గ్రామంలో ఘనస్వాగతం..
మావోయిస్టు దంపతులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయి మంగళవారం రాత్రి పారుపల్లికి చేరుకోగా, గ్రామస్తులు డప్పుచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పరిచయం చేసుకున్నారు.