చెరువుల సర్వే స్పీడప్.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్థారణలో జాప్యం

చెరువుల సర్వే స్పీడప్..  ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్థారణలో జాప్యం
  • పదేండ్లుగా ప్రిలిమినరీ నోటీఫికేషన్స్​కే పరిమితం 
  • కాంగ్రెస్​ వచ్చాక కదిలిన యంత్రాంగం
  • 36 చెరువులకు ఫైనల్​ నోటిఫికేషన్స్​

యాదాద్రి, వెలుగు : హెచ్​ఎండీఏ పరిధిలోని చెరువులపై అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. చెరువులు యధాతధంగా ఉన్నాయా..? కబ్జాకు గురయ్యాయా.? బఫర్ జోన్​లో పర్మినెంట్ నిర్మాణాలు జరిగాయా..? అన్నది తేల్చడం లేదు. చెరువులకు సంబంధించి సర్వే జరగాల్సిఉండగా పదేండ్ల నుంచి ముందుకు సాగలేదు. 

అన్ని చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ వెలువడగా, కొన్ని చెరువులకు ఫైనల్​ నోటిఫికేషన్​ జారీ చేశారు. ఈ ప్రక్రియ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్పీడ్​ అందుకుంది. కొన్ని చెరువులు కబ్జాలకు గురై.. వరద ముంచెత్తుతుండడంతో వేగంగా సర్వే చేయాలని యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు. 

హెచ్​ఎండీఏ పరిధిలో 237 చెరువులు

యాదాద్రి జిల్లాలోని భువనగిరి, బొమ్మల రామారం, భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్​, చౌటుప్పల్​ మండలాలు హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో 237 చెరువులు ఉన్నాయి. ఇందులో కొన్ని చెరువులు ఆక్రమణకు గురయినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2015లో చెరువుల సర్వే చేయాలని భావించి గత పదేండ్లలో వాటికి ఐడీ నెంబర్లు కేటాయించి ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేశారు. 

అప్పటి మ్యాప్​లను డిజిటలైజ్​ చేశారు. 25 ఎకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణంగల చెరువులకు ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్‌ ఉంటుందని నిబంధనలున్నాయి. 25 ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణంగల చెరువులు, కుంటలకు 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. బఫర్​ జోన్​ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. హైడ్రా ఏర్పాటు తర్వాత టీమ్స్ ను నియమించి 2024 నవంబర్​లోగా చెరువుల సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 36 చెరువులకు ఫైనల్​ నోటిఫికేషన్​

గత ఏడాది ఆగస్టులో రంగంలోకి దిగిన టీమ్స్ చెరువులను పరిశీలించాయి. నవంబర్​నాటికి 30 చెరువులకు, ఈ ఏడాది మరో ఆరు చెరువులకు ఫైనల్​ నోటిఫికేషన్​ జారీ చేసి.. ఎఫ్​టీఎల్ ​, బఫర్​ జోన్ నిర్ధారించారు. 

చెరువుల విస్తీర్ణం, ఆ భూముల సర్వే నెంబర్లు, యాజమాన్య వివరాలను నమోదు చేశారు. చెరువుల్లో నిర్మాణాలు ఉన్నాయా..? అన్న వివరాలను కూడా పేర్కొన్నారు. కాగా చౌటుప్పల్​లోని దూరచెరువులోనే ప్రభుత్వాఫీసులు నిర్మించారు. చెరువు నిండినప్పుడల్లా ఆఫీసుల్లోకి వరద నీరు చేరుతోంది. భువనగిరి, బీబీనగర్​లోని పెద్ద చెరువుల్లో ఆక్రమణలు జరిగాయి. ఈ చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్​ ఇచ్చినా ఇప్పటివరకూ సర్వే జరగలేదు. 

సర్వే చేయాలని కలెక్టర్​ ఆదేశం 

హెచ్​ఎండీఏ పరిధిలోని చెరువులను పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కలెక్టర్​ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తరచూ కురుస్తున్న వానలు, చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. దీంతో రెవెన్యూ డిపార్ట్​మెంట్​ స్టాఫ్​తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చెరువుల ఆక్రమణపై దృష్టి సారించాలని, ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్​లు నిర్దారించాలని సూచించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని ఆదేశించారు. 

హెచ్​ఎండీఏ పరిధిలోని  మండలాలు, గ్రామాలు

మండలం                 గ్రామాలు     చెరువులు    ఫైనల్​ నోటిఫికేషన్​
భువనగిరి                      19                73                           3
బీబీనగర్​                       16                34                           2
బొమ్మల రామారం        19                51                           7
చౌటుప్పల్​                    16               35                          14
భూదాన్​ పోచంపల్లి      19               44                          10