అడెల్లి పోచమ్మ దర్శనం తర్వాత మొదలైన బండి పాదయాత్ర

అడెల్లి పోచమ్మ దర్శనం తర్వాత మొదలైన బండి పాదయాత్ర
  • హైకోర్టు తీర్పుతో మారిన రూట్​మ్యాప్​
  • నిర్మల్ నుంచి అడెల్లి వరకు దారి పొడువునా నీరాజనం
  • పటాకులు పేల్చి యువకుల సంబురాలు
  • రాత్రి గుండెగాంలో సంజయ్ బస

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం జరగాల్సిన బీజేపీ స్టేట్ చీఫ్ ​బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర, బహిరంగ సభకు పర్మిషన్​ లేదని పోలీసు ఆఫీసర్లు ఆదివారం రాత్రి ప్రకటించడంతో బీజేపీ కార్యకర్తలు, లీడర్లు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి నిర్మల్, ఖానాపూర్, భైంసా తదితర ప్రాంతాల్లో నిరసన దిగిన లీడర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది. అయితే  సాయంత్రం వరకు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పాదయాత్ర రూట్ మ్యాప్​అప్పటికప్పుడు తయారు చేయడం కోసం సీనియర్​ లీడర్లంతా సీరియస్​గా కసరత్తు చేశారు. సాయంత్రం బండి సంజయ్ సారంగాపూర్​ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారని వెల్లడించారు. దీంతో బహిరంగసభలో పాల్గొనేందుకు భైంసాకు చేరుకున్న పార్టీ లీడర్లు, కార్యకర్తలంతా నిర్మల్ మీదుగా ఆడెల్లి పోచమ్మ వద్దకు చేరుకున్నారు. పరిస్థితుల తీవ్రతను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి తదితరులు నిర్మల్, భైంసాలో కార్యకర్తలతో చర్చించారు. కరీంనగర్​ నుంచి బండి సంజయ్​రోడ్డు మార్గం గుండా అడెల్లి పోచమ్మ ఆలయానికి బయలుదేరిన సమాచారం తెలుసుకున్న పార్టీ శ్రేణులు సంబురంలో మునిగిపోయారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​సాయంత్రం 6.30 గంటలకు నిర్మల్​కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, అర్వింద్ ​తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్​నేరుగా ఆడెల్లి పోచమ్మ దేవాలయానికి బయలు దేరారు. సారంగాపూర్ వద్ద వందలాది మంది యువకులు పటాకులు పేల్చి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్​ దాదాపు కిలో మీటర్ మేర పాదయాత్ర చేశారు. తర్వాత భైంసా మండలం గుండెగాం గ్రామానికి వెళ్లారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. పోలీసులు నిర్మల్​ నుంచి అడెల్లి పోచమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా, బస్టాండ్, చించోలి చౌరస్తా, సారంగపూర్​లో పోలీసు బలగాలు మోహరించాయి.