
బాలీవుడ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. నటుడు అక్షయ్ కుమార్‌కి ఆదివారం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘రామ సేతు’ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా టీంలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్టులకు కరోనా టెస్ట్ చేయగా.. 45 మందికి పాజిటివ్‌గా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి కొత్త లొకేషన్‌లో ప్రారంభంకానుంది. దాంతో టీంలోని 100 మంది సభ్యులకు కరోనా టెస్ట్ చేశారు. ఆ టెస్టుల్లో 45 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ రావడంతో.. రామ సేతు సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా.. అక్షయ్‌కు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో.. వైద్యుల సూచన మేరకు ఆయన సోమవారం ఆస్పత్రిలో చేరారు.
ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బీఎన్. తివారీ ఈ వార్తను ధృవీకరించారు. ‘రామ సేతు టీంలోని చాలామందికి ఒకేసారి పాజిటివ్ రావడం చాలా దురదృష్టకరం. చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు కాగా.. మిగతావారు అక్షయ్ కుమార్ బృందంలోని కొంతమంది సభ్యులు. ప్రస్తుతం వీరంతా నిర్బంధంలో ఉన్నారు. వీరికి వైద్య సహాయం అందుతుంది. అక్షయ్ కూడా క్వారంటైన్‌లో ఉండటం వల్ల ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి నిలిపివేయబడింది’ అని తివారీ తెలిపారు.
అక్షయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ బహరుచా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 30 వరకు ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొత్త లొకేషన్‌కు వెళ్లేముందు కరోనా కలకలం రేగింది.