డీజీపీ సర్ది చెప్పాక.. కోడల్ని ఇంట్లోకి రానిచ్చిన రబ్రీ దేవి

డీజీపీ సర్ది చెప్పాక.. కోడల్ని ఇంట్లోకి రానిచ్చిన రబ్రీ దేవి

‘‘అత్తింట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. ఆడపడుచు హింస పెడుతోంది.. మూడు నెలలుగా తిండి కూడా పెట్టట్లేదు.. ఇప్పుడు ఏకంగా ఇంట్లోంచి గెంటివేశారు’’  అని ఆదివారం రోడ్డెక్కిన ఆర్జేడీ చీఫ్ లాలూ కోడలు ఐశ్వర్య రాయ్ ఎట్టకేలకు అత్తింట్లో మళ్లీ అడుగుపెట్టింది. సోమవారం నాడు ఏకంగా డీజీపీ కలగజేసుకుని సర్ది చెప్పాక ఆమెను ఇంట్లోకి రానిచ్చింది అత్త రబ్రీ దేవి.

కోర్టులో విడాకుల పిటిషన్ పెండింగ్

తండ్రితో కలిసి ధర్నాలో ఐశ్వర్య

లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కు బిహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ తో గత ఏడాది ఘనంగా వివాహం జరిగింది. కొద్ది నెలలకే ఆ పెళ్లి.. విడాకుల దాకా వెళ్లింది. ఇద్దరి మధ్య పొంతన కుదరడం లేదంటూ విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. కానీ, ఆ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. అప్పటి వరకు భర్తతోనే కలిసి ఉండాలని ఐశ్వర్య నిర్ణయించుకుంది.

భర్తతో ఇబ్బంది లేదు.. ఆడపడుచు వల్లే..

తనను అత్తింటి వారు వేధిస్తున్నారంటూ ఐశ్వర్య ఆదివారం నాడు రోడ్డెక్కింది. తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె మహిళా హెల్ప్​ లైన్​కు ఫోన్​ చేయడంతో పోలీసులు రంగంలోకిదిగారు. తండ్రి చంద్రికా రాయ్​తోకలిసి లాలూ ఇంటి వరండాలో ధర్నాకు దిగిన ఐశ్వర్య మీడియాతో మాట్లాడారు.

రబ్రీ దేవి, మీసా భారతి

‘‘విడాకులపై కోర్టు తీర్పు వచ్చేదాకా భర్త(తేజ్​ ప్రతాప్​ యాదవ్​)తోనే కలిసుండాలనుకున్నా. అత్త(రబ్రీదేవి), ఆడపడుచు(మీసా భారతి)కి నేనంటే మొదటి నుంచీ ఇష్టం లేదు. ఇంత పెద్ద ఇంట్లో మూడు నెలలుగా(జూన్​ నుంచి) నాకు తిండి పెట్టట్లేదు. కిచెన్​ తాళాలు వేసుకుని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇంట్లో నా పరిస్థితిపై వీడియో తీస్తుంటే, రబ్రీదేవి బాడీ గార్డొచ్చి మొబైల్​ లాక్కొనే ప్రయత్నం చేశాడు. అంతా కలిసి నన్ను బయటికి గెంటేశారు. ఇంట్లో నాకు సెక్యూరిటీ లేదు. అందుకే పోలీసులకు ఫోన్  చేశా’’అని ఐశ్వర్య ఏడుస్తూ చెప్పారు. వ్యక్తిగతంగా భర్త(తేజ్​ ప్రతాప్​), మరిది(తేజస్వీ) ఇబ్బంది పెట్టలేదన్న ఐశ్వర్య.. ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని చెప్పారు. మూడు నెలలుగా పుట్టింటివాళ్లు పంపే భోజనంతోనే కడుపునింపుకుంటున్నానని తెలిపారు. కాపురం నిలబెట్టడానికి తాము ప్రయత్నిస్తుంటే, అటునుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ఐశ్వర్య తండ్రి, బీహార్​ మాజీ మంత్రి చంద్రికా రాయ్ అన్నారు.

డీజీపీ రంగ ప్రవేశంతో

ఐశ్వర్య ఆందోళన మీడియాలో న్యూస్ రావడంతో కొద్ది మంది రాజకీయ నేతలు, మహిళా సంఘాల కార్యకర్తలు.. లాలూ ఇంటి ఎదుట దర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ ఇంటి వ్యవహారం కాస్తా పెద్ద గొడవలా మారడంతో సోమవారం ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండేనే నేరుగా రంగంలోకి దిగారు. రబ్రీ దేవికి సర్ది చెప్పి కోడలు ఐశ్వర్యను ఇంట్లోకి తీసుకుని వెళ్లేలా ఒప్పించారు. దీంతో పెద్ద హైడ్రామాకు తెరపడింది.