బంగ్లాదేశ్లో మరో హిందూ పూజారి శ్యామ్ దాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్లో మరో హిందూ పూజారి శ్యామ్ దాస్ ప్రభు అరెస్ట్

ఛట్టోగ్రామ్: బంగ్లాదేశ్లో మరో ఆధ్యాత్మిక గురువు అరెస్ట్ కావడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. శనివారం రోజు ఇస్కాన్ సభ్యుల్లో ఒకరైన శ్యామ్ దాస్ ప్రభును ఛట్టోగ్రామ్లో అరెస్ట్ చేశారు. ఆధ్యాత్మిక వేత్త చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ అయిన రోజుల వ్యవధిలోనే మరో ఇస్కాన్ సభ్యుడిని అదుపులోకి తీసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోల్కత్తా ఇస్కాన్ ప్రతినిధి, వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ఈ అరెస్ట్పై స్పందించారు. శ్యామ్ దాస్ ప్రభు ఫొటోను పోస్ట్ చేసి ‘‘ఈయన మీకు టెర్రరిస్ట్లా కనిపిస్తున్నారా..?’’ అని విస్మయం వ్యక్తం చేశారు. అమాయకులైన ఇస్కాన్ బ్రహ్మచారులను ఇలా అరెస్ట్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌‌ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో ఢాకాలోని హజ్రత్‌‌ షాజలాల్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో కృష్ణదాస్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణదాస్‌‌ అరెస్ట్‌‌పై, బెయిల్‌‌ నిరాకరణపై తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.  ఆయన అరెస్ట్‌‌కు నిరసనగా బంగ్లాదేశ్‌‌లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడులు చేయడం సరికాదని తెలిపింది. హిందు దేవాలయాలను అపవిత్రం చేయడం, మైనార్టీల ఇండ్లపై దాడులు, వారి వ్యాపార సంస్థలను దోచుకుంటున్న వారు పరారీలో ఉన్నారని, కానీ, తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ర్యాలీలో పాల్గొంటున్న కృష్ణదాస్‌‌పై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.