
కొవిడ్ -19 వ్యాప్తించిన తర్వాత దేశంలో అనేక మందిలో ఒత్తిడి, కోపం, బాధ, ఆందోళన లాంటి ప్రతికూల భావోద్వేగాలు పెరిగాయిని అధ్యయనం తేల్చింది. . హ్యాపీప్లస్ అనే సంస్థ చేపట్టిన ది స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ 2023 అనే సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 35 శాతం మంది భారతీయులు ఈ ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నారని తేలింది. గతేడాది అలాంటి వారు 33 శాతం మాత్రమే ఉండడగా..ఈ ఏడాది అధికంగా 2 శాతం నమోదైంది. అయితే ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 60 శాతం మందితో అరుణాచల్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 58 శాతంతో మధ్యప్రదేశ్ రెండో స్థానం, 51 శాతంతో గుజరాత్, ఉత్తరప్రదేశ్ లు మూడు, నాల్గో స్థానాల్లో నిలిచాయి. మరోవైపు భారతీయులలో సానుకూల భావోద్వేగాలు 70 శాతం నుండి 67 శాతానికి పడిపోయినట్లు సర్వే వెల్లడించింది. జీవిత మూల్యాంకన స్కోర్ 2022లో 10 పాయింట్లకు గానూ 6.84 పాయింట్లు సాధిస్తే....2023లో 6.08 పాయింట్లకు పడిపోవడం గమనార్హం.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 14 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఆర్థిక సమస్యలు, కార్యాలయ ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనం, COVID-19 మహమ్మారి తర్వాత అనిశ్చితుల వంటి అనేక కారణాల వల్ల భారతీయులు అసంతృప్తికి గురవుతున్నారని సర్వే తన నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం దేశంలోని 18 ఏళ్లలోపు ప్రజలు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇతర వయస్సుల కంటే ఎక్కువగా కోపం, విచారాన్ని అనుభవిస్తున్నారు. 2022లో 10 మందిలో 2 మంది సంతోషంగా లేకపోగా..ఈ ఏడాది 10 మందిలో 5 మంది సంతోషంగా లేని వ్యక్తులుగా నమోదయ్యారని హ్యాపీప్లస్ సంస్థ తెలిపింది. భారతదేశంలో సామాజిక మద్దతు లేకపోవడంతో పాటు ఇతర సమస్యలు, వృతి పరమైన సమస్యల కారణంగా స్కోర్‌లను తగ్గింది.